భారత సంతతికి చెందిన మాజీ ఆర్ధిక మంత్రి, 42 ఏళ్ళ రిషి సునాక్ బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. రవి అస్తమించని సామ్రాజ్యం నెలకొల్పుకున్న బ్రిటన్ వందల ఏళ్ళు భారత దేశాన్ని వలస రాజ్యంగా మలచుకొని, వెనుకకు మళ్ళిన 75 ఏళ్ళ తర్వాత నేడు ఓ భారత సంతతి వ్యక్తి ఆ దేశాధినేత కావడం గమనార్హం. ఈ నెల 28న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అధికార పార్టీ కన్జర్వేటివ్ పార్టీ (టోరీ)కి చెందిన ఎంపీల్లో సగానికిపైగా ఎంపీల మద్దతు రుషి సునాక్‌కు లభించింది. 188 మంది ఎంపీలు ఆయనకు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన తదుపరి బ్రిటన్ ప్రధాన మంత్రిగా నియమితుడయ్యారు. అంతకుముందు ఆయనకు పోటీదారుగా నిలిచిన పెన్నీ మోర్డాంట్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.
మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా పోటీ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. రుషి సునాక్ సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో లిజ్ ట్రస్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆమె అనేక యూ-టర్న్‌లు తీసుకుని విమర్శలపాలై, చివరికి రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్‌కు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం వహించేందుకు రుషి సునాక్ ముందుకొచ్చారు.
ఓడిన చోటే గెలిచిన ధీరుడిగా రికార్డు సృష్టించారు. మరోవైపు లిజ్ ట్రస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో ఆయన విమర్శల జోలికి పోకుండా, అత్యంత సంయమనం పాటించడం మరో విశేషం. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా రిషి సునాక్ (42) నిలుస్తారు.
బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా నియమితుడైన రుషి సునాక్ కు మాజీ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోమవారం ఆమె ఇచ్చిన ఓ ట్వీట్లో, కన్జర్వేటివ్ పార్టీ నేతగా, నూతన ప్రధాన మంత్రిగా నియమితుడైన రుషి సునాక్‌ను అభినందించారు. ‘‘మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.
మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ.. డౌనింగ్ స్ట్రీట్-10లో అడుగు పెట్టాలని భావించినా అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల నుంచి మద్దతు సంపాదించలేకపోయారు. ఆయనకు కేవలం 58 మంది ఎంపీలు మాత్రమే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఐక్యత కోసం తాను ప్రధాని పదవి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.