బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్ రాజీనామా చేయడం, వెంటనే రిషి సునాక్ పదవీ బాధ్యతలు చేపట్టడం అంత లక్షణాలలో జరిగి పోయాయి. రానున్న రోజుల్లో కఠిన నిర్ణయాలకు బ్రిటన్ ప్రజలు సిద్ధం కావాలని ప్రధానిగా తన తొలి ప్రసంగంలో రిషి సునాక్ పిలుపునిచ్చారు.
లిజ్ ట్రస్.. తన అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో చివరి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. అటుపై తన రాజీనామా లేఖను రాజు చార్లెస్-3కి సమర్పించారు. దీంతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ప్రమాణం చేసేందుకు మార్గం సుగమమైంది. చివరి క్యాబినెట్ భేటీ తర్వాత లిజ్ ట్రస్ మాట్లాడుతూ రిషి సునాక్ పాలన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మంచి రోజులు ముందు ఉన్నాయన్నారు. దేశ ప్రధాని అయ్యే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక లిజ్ ట్రస్ అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. కన్సర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్యే పోటీ జరిగింది. చివరకు లిజ్ ట్రస్ విజేతగా నిలిచారు. కానీ ఆమె తీసుకు వచ్చిన మధ్యంతర బడ్జెట్ బ్రిటీష్ వారి ఆర్ధిక వ్యవస్థను మరింత అస్తవ్యస్తం చేసింది.
లిజ్ ట్రస్ ఆర్ధిక విధానాలతో బ్రిటన్ మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ తరుణంలో అధికారం చేపట్టిన 45 రోజులకే ఆమె యూ టర్న్ తీసుకున్నారు. ప్రధానిగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కన్సర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. వెయిటర్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన రిషి సునాక్ బ్రిటన్ చరిత్రలోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడు.
2009లో రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షితామూర్తిని వివాహమాడారు. వీరికి ఇద్దరు సంతానం. కృష్ణా సునాక్, అనౌష్కా సునాక్. రిషి సూనాక్ ఎన్నికై రికార్డు సృష్టించడంపై ఆయన మామగారు, ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి అభినందనలు తెలిపారు. ”ఆయనను (రిషి సునాక్) చూసి మేము గర్విస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన అత్యున్నత నిర్ణయాలు తీసుకుంటారని బలంగా నమ్ముతున్నాం” అని ఆయన పేర్కొన్నారు