మాజీ ప్రధాని లిజ్ ట్రస్ హయాంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్దుతానని, ఆర్థిక సుస్థిరత, విశ్వాసం కల్పించడమే తమ ప్రభుత్వ ఏజెండా అనిహన ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. తక్షణం తమ ప్రభుత్వ పనితీరు మొదలవుతుందని ఆయన వెల్లడించారు.
మంగళవారం బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత అధికార నివాసరం డౌనింగ్ స్ట్రీట్-10 నుంచి రిషి సునాక్ మాట్లాడుతూ ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్తిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.
రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అంతటా ప్రొఫెషనలిజంతో కూడిన అకౌంటబిలిటీ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక సుస్థిరత తీసుకొస్తానని పేర్కొన్నారు. ఇంతకుముందు బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ప్రజలను, వ్యాపారాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నానని సునాక్ గుర్తు చేశారు. ఇప్పుడు దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడవేసేందుకు అవే చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
భావి తరాలను అప్పుల ఊబిలో దించలేనని స్పష్టం చేశారు. కబుర్లతో కాలక్షేపం చేయకుండా దేశ ఐక్యత కోసం కృషి చేస్తానని రిషి సునాక్ హామీ ఇచ్చారు. మనమంతా కలిసి పని చేస్తే నమ్మశక్యం గానీ విజయాలను సాధించగలమని ఆయన చెప్పారు. లక్షల మంది బ్రిటన్ వాసులు ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యావత్ దేశం నిధుల లేమిని ఎదుర్కొంటున్నదని, తాను తప్పనిసరిగా ఆర్థిక సంక్షోభానికి పరిష్కార మార్గాలు వెతకడంపైనే దృష్టి సారిస్తానని చెప్పారు.