ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు(ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం బిల్లుకు) లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు చివరిదాకా యత్నించాయి. విపక్షాల ఆందోళన మధ్యే సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. బోగస్ ఓట్లను తొలగించడానికే ఈ బిల్లు తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. బిల్లును ఆమోదించాక సభ మంగళవారానికి వాయిదాపడింది.
గత వారం కేంద్ర కేబినెట్లో ఈ బిల్లును ఆమోదించిన కేంద్రం.. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎన్నికల చట్ట (సవరణ) 2021 పేరుతో బిల్లును కేంద్రం తెచ్చింది. ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలి అనుకునేవారి గుర్తింపు పత్రంగా ఆధార్ నెంబర్‌ను అడిగే హక్కు ఎన్నికల నమోదు అధికార్లకు ఉండేలా చట్టంలో మార్పుల బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు.
ఇవాళ మధ్యాహ్నంఒ స్వల్ప చర్చ తర్వాత ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు ఆమోదం దక్కింది. ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. ఇక నుంచి ఓటు రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారి నుంచి ఎన్నికల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఆధార్ నెంబర్‌ను తీసుకుంటారు. ఐడెంటినీ గుర్తించేందుకు ఇది అవసరం అవుతుందని మంత్రి రిజిజు తెలిపారు.
లోక్‌సభలో ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించగా, బోగస్ ఓటింగ్, నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పదని చెబుతూ మంత్రి రిజిజు వారి అభ్యంతరాలను కొట్టిపారవేసారు.
ఆధార్ చట్టం ప్రకారం ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయరాదని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పేర్కొంటూ ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.