సినీ నటి రంభకు తృటిలో ప్రమాదం తప్పింది. కెనడాలో స్కూల్ నుంచి పిల్లల్ని కారులో తీసుకొస్తుండగా.. మరో కారు వచ్చి ఢీకొట్టింది. దాంతో రంభతో పాటు ఆమె పిల్లలకి కూడా గాయాలయ్యాయి. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రంభ తీవ్ర గాయాలైన కూతురు సాషా త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేయాలని సూచించింది.
“ఇంటర్సెక్షన్ వద్ద మా కారుని మరో కారు వచ్చి ఢీకొట్టింది. కారులో నాతో పాటు పిల్లలు, అమ్మమ్మ ఉన్నారు. అందరం స్వల్ప గాయాలతో బయటపడ్డాం. కానీ నా చిట్టి తల్లి సాషా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. బ్యాడ్ డేస్.. బ్యాడ్ టైమ్.. సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయండి’’ అని రంభ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
తమకు చిన్నపాటి గాయాలయ్యాయని రంభ రాసుకొచ్చింది. ప్రస్తుతం తామంతా క్షేమంగా ఉన్నామని.. తన చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలోనే ఉందని స్పష్టం చేసింది. దేవుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ రంభ పోస్ట్ చేసింది.
దాంతో పాటు కారు యాక్సిడెంట్ ఫొటోలను షేర్ చేసిన రంభ… ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. అందువల్ల, ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటనలో కారు డోర్స్ మాత్రం బాగా డ్యామేజ్ అయినట్టు ఫొటోలను చూస్తే తెలుస్తోంది.
తెలుగు, తమిళ్, హిందీతో పాటు పలు భాషల్లో సుమారు 100కి పైగా సినిమాల్లో రంభ నటించింది. శ్రీలంకకి చెందిన తమిళ్ బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ని పెళ్లి చేసుకున్న రంభ అతనితో కలిసి కెనడాలో సెటిలైంది. వీరికి 2010, ఏప్రిల్ 10న వివాహమైంది. ఆమెకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు.