గత కొన్ని రోజులుగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు కుట్రలు జరుగుతున్నాయని చెబుతూ పలిమెల గ్రామంలో ఈటల కాన్వాయ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు.
మునుగోడులో బిజెపి గెలుపు కోసం పనిచేస్తున్న ఈటలపై కుట్ర జరుగుతోందని పేర్కొంటూ ఈటల మొహం చూడొద్దని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ లో శాసనసభ్యులను సివిల్ పోలీసులు అరెస్ట్ చేయడం చరిత్రలో లేదని స్పష్టం చేశారు.
పలివెల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుంటే దాడులకు దిగారని, పక్కా ప్లాన్ తో ఇలా చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. పోలీసులు వద్దు అని చెప్పినా వినకుండా టిఆర్ఎస్ నేతలు దాడులకు దిగినట్లు ఆయన చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చివరి సమయంలో ఉద్రిక్తలకు దారితీసింది. పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్న క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్ ఫై రాళ్ల దాడి చేసారు.
ఈ దాడి లో 20 మందికి పైగా బిజెపి కార్య కర్తలకు గాయాలు అయ్యాయి. అలాగే పలు వాహనాలు ధ్వసం అయ్యాయి. ఈ దాడి ముమ్మాటికీ టిఆర్ఎస్ పార్టీనే చేసిందని బిజెపి ఆరోపిస్తుంది. ఈ ఘటనపై ఈటల రాజేందర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చోద్యం చూస్తున్నారా అంటూ పోలీసులపై మండిపడ్డారు.
పలివెల గ్రామంలో ఓట్లు రావని, మునుగోడులో ఓటమి భయంతో.. బస్తాల్లో రాళ్లు నింపుకుని తిరుగుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కర్రలు, రాళ్లతో ఎందుకు తిరుగుతున్నారు ? గతంలో మీటింగ్ అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు రాళ్ల దాడికి పాల్పడ్డారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిఆర్ఎస్శ్రేణులు దాడి జరిపిన అనంతరం గ్రామంలో ప్రజలను డిస్టర్బ్ చేయకుండా ఎమ్మెల్యే ఈటల వెనక్కి తిరిగారని పేర్కొన్నారు. దాడి చేసినవాళ్లను అరెస్ట్ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దాడులకు తాము భయపడమని స్పష్టం చేశారు.
బిజెపి నేతల కార్లు మాత్రం తనిఖీలు చేస్తారని..టిఆర్ఎస్ వాహనాలు అలాగే వదిలేస్తారని అంటూ నవంబర్ మూడో తేదీన మునుగోడు ప్రజలు సిఎం కెసిఆర్ కు బుద్ధి చెబుతారని భరోసా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే మునుగోడులో టీఆర్ఎస్ శ్రేణులు ఈ దాడులు చేస్తున్నాయని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆరోపించారు.ఇప్పటికే నాలుగుసార్లు దాడికి యత్నించారని, ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులు చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి ఈ దాడి చేయంచాడన్న ఆయన… టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదని హెచ్చరించారు. భయపడకుండా ధర్మం వైపు నిలబడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఏం చేసినా మునుగోడులో బిజెపి పార్టీ నే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.
కాన్వాయ్ పై జరిగిన దాడిలో గాయపడ్డవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.