గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన ఘటనలో ఓ ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. మోర్బీ మున్సిపల్ విభాగం చీఫ్ ఆఫీసర్(సీవో) సందీప్‌సిన్హ్ జాలాను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
మోర్బీ మున్సిపాలిటీ ఒరెవా సంస్థకు 15 ఏళ్లపాటు ఈ వంతెన మరమ్మతులు, నిర్వహణ కాంట్రాక్టును ఇచ్చినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ కేబుల్ వంతెనను పున్ణ ప్రారంభించే ముందు అధికారులకు సమాచారం అందించలేదని జాలా చెప్పారు.
బ్రిటిష్ కాలం నాటి ఈ వంతెనకు మరమ్మతులు నిర్వహించిన తర్వాత సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
మోర్బీ మున్సిపాలిటీ ముఖ్య అధికారి సందీప్‌సిన్హ్ జాలాను రాష్ట్ర పట్టణాభివఅద్ధి శాఖ సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జీటీ పాండ్య వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రెసిడెంట్ అదనపు కలెక్టర్‌కు చీఫ్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
అంతకుముందు గురువారం ఈ ఘటనపై పోలీసులు జాలాను నాలుగు గంటలకుపైగా విచారించారు. గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన దుర్ఘటనలో ఇప్పటివరకు 135 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ఘటనాస్థలాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించారు. మరోవైపు, పోలీసులు ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
మరోవంక, నిర్వహణ కాంట్రాక్టును 15 ఏళ్ల కాలానికి తీసుకున్న ఒరేవా గ్రూప్.. వేరే సంస్థకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. కేబుల్ బ్రిడ్జి మరమ్మతులకు 2 కోట్లు కేటాయిస్తే.. కాంట్రాక్ట్ సంస్థ కేవలం 12 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
కేబుల్ బ్రిడ్జి మరమ్మతులకు కాంట్రాక్ట్ తీసుకున్న ఒరెవా సంస్థ గడియారాలు తయారు చేస్తుంది. ఈ సంస్థకు మౌలిక సదుపాయాల కల్పనలో నైపుణ్యం, అనుభవం లేదు. అందుకే ధ్రగాంధ్రకు చెందిన దేవ్ ప్రకాశ్ సొల్యూషన్కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అయితే ఈ సంస్థకు కూడా కేబుల్ బ్రిడ్జి మరమ్మతులు, నిర్వహణ చేసే సాంకేతిక పరిజ్ఞానం లేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దేవ్ ప్రకాశ్ సొల్యూషన్ నుంచి కీలక డాక్యుమెంట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.