దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పీఏని ఈడీ అరెస్ట్ చేసింది. అతడు దర్యాప్తునకు సహకరించడం లేదంటూ అదుపులోకి తీసుకుంది.
శనివారం ఈడీకి చెందిన ప్రత్యేక బృందం ఈస్ట్ ఢిల్లీ మండవ్లీలోని సిసోడియా పీఏ దేవేంద్ర శర్మ అలియాస్ రింకూ ఇంట్లో తనిఖీలు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించింది.
అయితే దర్యాప్తు సమయంలో రింకూ సహకరించకపోవడంతో అతడిని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి దాకా ఈడీ వందకు పైగా సోదాలు జరిపింది. ఆప్ మంత్రి సత్యేంద్రజైన్, ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌లను విచారించి అరెస్ట్ చేసింది. తన పీఏ రింకూను ఈడీ అరెస్ట్ చేసిందంటూ మనీశ్ సిసోడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి భయం పట్టుకుందని ఆరోపించారు.
‘‘తప్పుడు ఎఫ్ఐఆర్ను నమోదు చేసి నా ఇంట్లో సోదాలు చేశారు. బ్యాంక్ లాకర్లు తనిఖీ చేశారు. మా గ్రామానికి కూడా వెళ్లారు. అయినా వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ రోజు నా పీఏ ఇంట్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదు” అని చెప్పుకొచ్చారు. “అందుకే ఇప్పుడు అతడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు. బీజేపీ నేతలు ఎన్నికల్లో ఓడిపోతామని చాలా భయపడుతున్నారు”అని హిందీలో ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.