ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200కోట్ల మనీలాండరింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటడి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. ఇటీవల మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది.
ఇంతకు ముందు ఇచ్చిన తాత్కాలిక బెయిల్ సమయం ఈ నెల 10వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో గురువారం బెయిల్‌పై విచారణ జరగ్గా నటి, ఈడీ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఫెర్నాండెజ్‌కు బెయిల్ పొడిగిస్తే దేశం విడిచి వెళ్లిపోతుందని ఈడీ విచారణ సందర్భంగా వాదించింది.
ఈ సందర్భంగా మిగతా నిందితులు జైలులో ఉండగా జాక్వెలిన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ‘పిక్ అండ్ చాయిస్ విధానాన్ని ఎందుకు అవలంబిస్తారు’ కోర్టు ఈడీని ప్రశ్నించింది. అయితే, నటి దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్లు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది.
ఇప్పటికే విచారణ పూర్తయి చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని బెయిల్ ఇవ్వాలని కోర్టును జాక్వెలిన్ కోరింది. రూ.200కోట్ల మనీలాండింగ్ కేసులో ఆర్థిక నేరగాడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి రూ.7కోట్ల వరకు కానుకలు అందుకున్నట్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌పై ఆరోపణలున్నాయి.
ఆర్థిక నేరగాడు సుకేశ్ సహా పలువురి ప్రమేయం ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ నిందితురాలిగా ఉంది. ఈ కేసులో ఈడీ శ్రీలంక బ్యూటీని విచారించి.. ఆస్తులను జప్తు చేసింది. కోర్టు తీర్పు అనంతరం నటిని అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల మధ్య.. తాజాగా ముందస్తు అరెస్టు బెయిల్‌ను 15వ తేదీ వరకు కోర్టు పొడగించింది.