సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కార్డియాల్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులుపై కూడా పడటంతో కృష్ణ ఆరోగ్యం విషమించిందని నిన్న వైద్యులు వెల్లడించారు.
వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ కృష్ణ ప్రాణాలను కాపడలేక పోయారు వైద్యులు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
1942 మే 31 న ఘట్టమనేని కృష్ణ గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయనకు 1964-65లో హీరోగా నటించే అవకాశం వచ్చింది. హీరోగా నటించిన మొదటి సినిమా తేనెమనసులు.
340 పైగా సినిమాల్లో కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కొద్దిరోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.
1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. 70, 80వ దశకాల్లో టాలీవుడ్లో ఆయనదే హవా. కృష్ణ ఏటా 10 సినిమాలు చేస్తుండేవారు. ఓ ఏడాదైతే 18 సినిమాల్లో నటించారంటే ఆయనకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
52 ఏండ్ల సినీ కెరీర్లో సూపర్ కృష్ణ 350కిపైగా చిత్రాల్లో నటించారు. గూఢచారి 116, సాక్షి, మోసగాళ్లకు మోసగాడు,పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం, భలే దొంగలు,మనస్సాక్షి, ఈనాడు, సింహాసనం, ముద్దు బిడ్డ, నంబర్ 1′ తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. సాక్షి సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శించారు.
నటుడిగా వెలిగిపోతున్నప్పుడే డైరెక్టర్, నిర్మాతగానూ మారారు కృష్ణ. తమ్ముళ్లతో కలిసి పద్మాలయ పిక్చర్స్ నెలకొల్పారు. ఆ బ్యానర్ నుంచి వచ్చిన మొదటి ‘అగ్నిపరీక్ష’ ఫెయిలైనా ఆ తర్వాత వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సూపర్ హిట్ అందుకుంది.
ఇక దర్శకుడిగా శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు, సింహాసనం లాంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు. తెలుగులో తొలి భారీ బడ్జెట్ సినిమా ‘సింహాసనం’ సూపర్ స్టార్ కృష్ణ నిర్మించారు. ఆ మూవీని ‘సింహాసన్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. మొత్తంగా 12కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ.. వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు.