ఇండోనేషియా తమ రాజధాని నగరం బాలిలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో రాబోయే సంవత్సరానికి జి20 అధ్యక్ష పదవిని భారత్కు బుధవారం అప్పగించింది. రెండు రోజుల సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రధాని నరేంద్ర మోదీకి అధ్యక్ష పదవిని అందజేశారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మహమ్మారి యొక్క దీర్ఘకాలిక దుష్ప్రభావాలతో ప్రపంచం ఏకకాలంలో పోరాడుతున్న సమయంలో భారతదేశం జి 20 బాధ్యతలను తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో, ప్రపంచం జి-20 వైపు ఆశతో చూస్తోందని… ఈ రోజు భారతదేశం జి-20 అధ్యక్ష పదవి అందరినీ కలుపుకొని, ప్రతిష్టాత్మకంగా, నిర్ణయాత్మకంగా, కార్యాచరణ-ఆధారితంగా ఉంటుందని తాను హామీ ఇస్తున్నానని ప్రధాని మోదీ చెప్పారు.
దేశాధినేతలు, ప్రభుత్వాల స్థాయిలో తదుపరి జి 20 సమ్మిట్ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జి-20కి భారతదేశం అధ్యక్షత వహించడం దేశానికి గర్వకారణమని, దేశం వివిధ నగరాలు, రాష్ట్రాల్లో జి-20 సమావేశాలను నిర్వహిస్తుందని తెలిపారు. ‘ప్రతి ఒక్క దేశం కృషితో అంతర్జాతీయ సంక్షేమానికి ఒక ఉత్ప్రేరకంగా జి-20 సదస్సును రూపొందించాలి.” అని మోడీ అన్నారు.
తమ అతిథులు భారతదేశపు అద్భుతమైన వైవిధ్యం, సమ్మిళిత సంప్రదాయాలు, సాంస్కృతిక గొప్పతనానికి సంబంధించిన పూర్తి అనుభవాన్ని పొందుతారని మోదీ చెప్పారు. భారతదేశంలో జరిగే ఈ అపూర్వమైన వేడుకలో మీరందరూ పాల్గొనాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే ఒక సంవత్సరంలో జి-20 కొత్త ఆలోచనలను రూపొందించడానికి, సమిష్టి చర్యను వేగవంతం చేయడానికి గ్లోబల్ ప్రైమ్ మూవర్గా పనిచేస్తుందని నిర్ధారించడానికి తాము కృషి చేస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
ఉక్రెయిన్ారష్యా యుద్ధాన్ని జిా20 సదస్సు ఖండించింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ నేతలు బుధవారం సంయుక్త డిక్లరేషన్ను ఆమోదించారు. యుద్ధాన్ని మెజారిటీ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయని, ఇతరత్రా అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని ఆ డిక్లరేషన్ పేర్కొంది.
భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు జిా20 సరైన వేదిక కాదని డిక్లరేషన్ పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించాలని కోరింది. అణ్వాయుధాల వినియోగం ముప్పును ఖండించింది. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లకు తరలి వెళ్లాల్సిన గోధుమలు వంటి ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో నల్ల సముద్రం ద్వారా తరలించేందుకు చేపట్టిన చొరవను సమావేశం స్వాగతించింది.