ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్ర, వినయ్ బాబులకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరో 4 రోజుల కస్టడీని పెంచుతూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లైలను కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈనెల 10వ తేదీన శరత్ చంద్ర, వినయ్ బాబులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిని
అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కోర్టు అనుమతితో వారం రోజులు కస్టడీకి తీసుకున్నారు. కాగా ఆ కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు శరత్ చంద్రా, వినయ్ బాబులను సిబిఐ కోర్టులో హాజరుపరిచారు.
వారు విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకోసం మరో వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అలాగే మరో ఇద్దరు చార్టర్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై లను విచారణకు అనుమతించాలని ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో తెలిపారు.
ఈ నలుగురిని కలిపి విచారించనుకుంటున్నామని, అందుకోసం కస్టడీ పొడిగించాలని అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కోర్టు కేవలం 4 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. అలాగే బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లైలను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ 2021-22కు గాను కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీ 2021 నవంబర్ 17న అమల్లోకి వచ్చింది. దీని కింద ఢిల్లీని 32 జోన్లుగా విభజించారు. మొత్తం 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. 144 కోట్ల రూపాయల బకాయిలను కూడా మాఫీ చేశారు.
ఈ లిక్కర్ పాలసీలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. ఎల్జీకి కూడా ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు ఆదేశాలు జారీచేశారు. మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది.