అక్రమ రవాణా భాదితులు తిరిగి మరలా అక్రమ రవాణాకు గురి కాకుండా వారి అవసరాలను తీర్చడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు సమన్వయoతో ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్ రాజేంద్ర సూచించారు.
వ్యాపార లైంగిక దోపిడీ కోసం ట్రాఫికింగ్ నుండి కాపాడిన భాదితులను తిరిగి పూర్వ స్థితికి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషిస్తున్న కమ్యూనిటీ ఆధారిత పునరావాసంపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం అని పేర్కొంటూ ఇతర రకాల సమస్యలతో సహా పేదరికం సమాజంలోని బాలలు, మహిళలపై జరిగే అన్ని రకాల హింసలకు దారి తీస్తుందని హెచ్చరించారు.
హెల్ప్, విముక్తి విజయవాడలో నిర్వహించిన “కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ (సీబీఆర్) పై విఎల్సిపిసి, పిఆర్ఐల సెన్సిటైజేషన్” రాష్ట్ర స్థాయి సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొంటూ
ట్రాఫికింగ్, ఇతర రకాల హింస నుండి కాపాడినవారు ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాల ప్రయోజనాలతో సహా రాష్ట్ర సహాయ సేవలను పొందడంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఇది భాదితులనే కాకుండా వారి పిల్లలను కూడా ప్రభావితం చేస్తుందని చెబుతూ భాదితులకు సహాయక సేవలను పొందేందుకు సాధ్యమైన ప్రతి సహాయాన్ని, సహకారాన్ని అందించాలని గ్రామ, వార్డు స్థాయి సచివాలయాల సిబ్బందికి ఆయన సూచించారు. హెల్ప్ ఆర్గనైజేషన్, విముక్తి ట్రాఫికింగ్ నుండి బయటపడిన వారి, వ్యాపార లైంగిక దోపిడీ (సెక్స్ వర్కర్లు) బాధితుల సామాజిక-ఆర్థిక సాధికారత కోసం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి వినీత మాట్లాడుతూ పిల్లలకు నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెబుతూ తద్వారా, బాలలు, మహిళలపై వివిధ రకాల హింసను కుటుంబాల స్థాయి నుండి క్రమంగా సమాజాల స్థాయి వరకు నిరోధించవచ్చని తెలిపారు.
రాష్ట్రంలో మహిళలు, బాలల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ వారి కుటుంబాలు, కుటుంబ సభ్యుల ద్వారానే నేరాలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
పిల్లలు, మహిళలపై జరిగే అన్ని రకాల హింసల నివారణకు ఇప్పటికే ఉన్న వ్యవస్థలు, యంత్రాంగాలను బలోపేతం చేయడానికి సంస్థలు/ఏజన్సీలు గట్టిగా కృషి చేయాలని ఆమె కోరారు.
బాధితులు తన మొబైల్కు కాల్ చేయాలని లేదా ఆమెకు సందేశం పంపాలని ఆమె సలహా ఇచ్చారు. తద్వారా రాష్ట్ర మహిళా కమిషన్ తరపున దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న మహిళలకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. హెల్ప్ కార్యదర్శి రామ్ మోహన్ నిమ్మరాజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ఆవశ్యకత, ప్రాముఖ్యతను వివరించారు.
విముక్తి అధ్యక్షురాలు శ్రీమతి అపూర్వ మాట్లాడుతూ కమ్యూనిటీ ఆధారిత పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. రెండవ తరం బాలల అక్రమ రవాణాను నిరోధించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. విముక్తి సభ్యులు ఈ క్రింది డిమాండ్లతో ఏపీ మహిళా కమిషన్, ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు వినతి పత్రాన్ని సమర్పించారు:
* కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్/కమ్యూనిటీ ఆధారిత పునరావాసం ను సమర్థవంతoగా అమలు చేసేందుకు సంబంధిత శాఖలకు ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, పోలీసు, న్యాయ శాఖ అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలకు ప్రభుత్వం ఒక స్పష్టమైన నియమాలు/నిర్దిష్టమైన ప్రామాణిక నిబంధనలతో కూడిన విధానాన్ని రూపొందించి ఖచ్చితంగా పాటించేలా చూడాలి.
* కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అమలులో ఎదురయ్యే కుటుంబం నుండి చిన్నచూపు, జీవనోపాధి అవకాశాలు లేకపోవడం, మానసిక ఆరోగ్య సేవల కొరత, సమాజంలో ట్రాఫికర్ల నుండి ముప్పు లాంటి సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి స్థానిక పాలన యంత్రాంగం ద్వారా తగిన చర్యలు చేపట్టాలి.
* క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, చట్టం, సెక్షన్ 357 (ఏబీసీ) ప్రకారం ఉచిత న్యాయ సహాయం/వినతి పత్రం సమర్పించడానికి వెసులుబాటు కల్పించడం, బాధితురాలికి నష్ట పరిహారం అందేలా చూసుకోండి ; నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (అక్రమ రవాణా, వ్యాపార లైంగిక దోపిడీ బాధితులు) పథకం, 2015; మహిళా బాధితులు/లైంగిక వేధింపులు/ఇతర నేరాల నుండి బయటపడిన భాదిత మహిళలకు పరిహారం పథకం, 2018; న్యాయ సేవల అధికారులు (జిల్లా/రాష్ట్రం)
*అక్రమ రవాణా (నిరోధక) చట్టం, 1956లోని నిబంధనలకు, ఉజ్వల పథకం, 2007కు అనుగుణంగా లైంగిక అక్రమ రవాణా భాదిత బాలలు, మహిళల అవసరాలను తీర్చడం ;
* లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం (పోక్సో), 2012 నిబంధనలు; ప్రత్యేక న్యాయస్థానాలు (చాప్టర్ VIII, సెక్షన్ 33); పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం, 2013; గృహ హింస నుండి మహిళల రక్షణ, చట్టం, 2005; మహిళా శక్తి కేంద్ర పథకం; మహిళా పోలీస్ వాలంటీర్స్ ప్రకారం లైంగిక దోపిడీకి గురైన మహిళలు ,బాలల అవసరాలను తీర్చడం.
* జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం, 2015 లోని నిబంధనలు; ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్; ప్రకారం గ్రామ మరియు బ్లాక్ స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు; జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా బాలలు (అక్రమ రవాణా నుండి బయటపడిన వారితో సహా) రక్షించబడ్డారని, సమాజంలో వారి అభివృద్ధికి తగిన అవకాశాలు కల్పించబడ్డాయని నిర్ధారించుకోండి.
* జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద అక్రమరవాణా నుండి రక్షించబడిన, వ్యాపార లైంగిక దోపిడీ బాధితులకు నైపుణ్యాల అభివృద్ధి, జీవనోపాధి అవకాశాలను పొందేలా చేయడం ; జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్లు.
* ప్రభుత్వ యంత్రాంగాలు సమాజంలో పునరేకీకరణ చేయబడ్డ భాదితులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అమలులో ఉన్న ఇతర సహాయ సేవలనుంచి నిరంతరాయంగా లబ్ధి పొందుతున్నారని గుర్తించి, నిర్ధారించుకోగలగాలి.
* ప్రస్తుత స్వచ్చంద సంస్థ-నేతృత్వంలోని నడుస్తున్నకమ్యూనిటీ ఆధారిత పునరావాస కార్యక్రమాలను పునరావృతం చేయడానికి సాధారణ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ఆధారంగా ప్రభుత్వం నోడల్ ఏజెన్సీలను ఏర్పాటుచేయాలి.
* భాదితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వ బాధ్యతలను సక్రమంగా అమలు చేసేందుకు, అన్నింటినీ ఒకే చట్టబద్ధమైన పరికరంలోకి తీసుకురాగల ఒక సమగ్ర చట్టం అవసరం
* మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు ఒక సమగ్ర చట్టం, భాదితులు తమ హక్కులను సాధించుకొనే దిశగా వారికి ప్రభుత్వం మరింత ప్రతిస్పందించేలా చేయడానికి కావలసిన, అవసరమైన ప్రేరణను అందిస్తుంది.