ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్ ను సోమవారం 8 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. సింహయాజీ స్వామికి శ్రీనివాస్‌కు మధ్య నడిచిన ఫోన్ కాల్స్ డేటాపై అధికారులు ఆరా తీశారు. దాంతో పాటు సింహయాజీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయటం గురించి కూడా శ్రీనివాస్‌ను అధికారులు ప్రశ్నిచారు.
అయితే.. సింహయాజీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది నిజమేనని ఒప్పుకున్న శ్రీనివాస్ కేవలం పూజల కోసమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశానని వెల్లడించారు. ఈ రెండు విషయాల మీదే కాకుండా అధికారులు పలు కోణాల్లో శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ గురించిన విషయాలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
కాగా, సోమవారం విచారణకు కేరళాకు చెందిన తుషార్, జగ్గుస్వామితో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా రావాల్సి ఉండగా.. కేవలం శ్రీనివాస్ మాత్రమే హాజరవ్వటం గమనార్హం. ఇప్పటికే ముగ్గురు నిందితులను ప్రశ్నించిన సిట్ అధికారులు.. వాళ్లు ఇచ్చిన సమాచారంతో పాటు ఆడియో, వీడియో ఆధారాల్లో ఉన్న సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పలువురిని విచారించాలని భావించారు.
అందుకు అనుగుణంగానే నోటీసులు కూడా పంపించారు. అయితే, కేరళకు చెందిన జగ్గుస్వామి అడ్రస్ లేకుండా వెళ్లగా.. తుషార్‌కు మాత్రం పోలీసలు నోటీసులు అందించారు. బీఎల్ సంతోష్ విషయంలో మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. నేరగా నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులను ఢిల్లీ పోలీసులు అడ్డుకోవటంతో, హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
అప్పటికీ.. హైకోర్టు కూడా విచారణకు సిట్ అధికారులకు సహకరించాలంటూ అటు ఢిల్లీ పోలీసులకు ఇటు బీఎస్ సంతోష్‌కు సూచించింది. అయినా, బీఎల్ సంతోష్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. అటు తుషార్, జగ్గుస్వామి కూడా విచారణకు హాజరు కాలేదు.
దీంతో.. సిట్ అధికారులు తర్వాత ఏం చేయనున్నారన్నది ఉత్కంఠగా మారింది. మరోవంక, శ్రీనివాస్ ను మంగళవారం కూడా విచారింపనున్నారు. శ్రీనివాస్ చెప్పిన అంశాలను బట్టి మరి కొంతమంది బిజెపి నాయకులకు కూడా నోటీసులు పంపే అవకాశం ఉంది.