మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్రలో నివాసం ఉంటున్నారు. ఉదయం నుంచి త్రిశూల్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నారు.
తెల్లవారుజాము నుంచే 50 టీములుగా విడిపోయిన ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు మల్లారెడ్డి, ఆయన కుమారులు, బంధువుల ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలలో తనిఖీలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిలతో సహా వారి బంధువుల ఇండ్లల్లోనూ ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ టీమ్స్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మైసమ్మగూడ, మేడ్చల్ లో వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నాయి.
మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. మహేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు.
మరోవైపు మంత్రి మల్లారెడ్డి చిన్నకొడుకు భద్రారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి సంస్థలు, ఆదాయాలు, లెక్కలు, పన్ను చెల్లింపులపై ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు.
మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి ఇంట్లో బీరువాలు, లాకర్లు ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు. అందులో బట్టలు, ఇతర సామాగ్రి మాత్రమే ఉందని బీరువా ఓపెన్ చేసిన వ్యక్తి చెప్పినట్లు తెలిసింది. బీరువా కీ లేదని చెప్పడంతో అక్బర్ అనే వ్యక్తిని ఓపెన్ చేసేందుకు పిలిపించినట్లు చెబుతున్నారు.
14 విద్యా సంస్థల కార్యాలయాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు నిర్వహించేటప్పుడు అధికారులు పలు కీలక సమాచారం తీసుకున్నారు. అందులో భాగంగా విద్యా సంస్థల లావాదేవీలకు సంబంధించి బాలానగర్‌లో ఉన్న ఓ ప్రాంతీయ బ్యాంకులో జరిగినట్లు గుర్తించారు.
దీంతో క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు చెందిన లావాదేవీలు అన్నీ బాలానగర్‌లో ఉన్న క్రాంతి బ్యాంక్‌లో జరిగినట్లుగా అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉంది. అందులో భాగంగానే ఆ లావాదేవీలపై బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావును ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో రాజేశ్వరరావు పార్టనర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. రెండు రోజులపాటు ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మంత్రి మల్లారెడ్డికి వివిధ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు ఐటీ గుర్తించింది. మేడ్చల్, మాల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తేల్చారు.
ఓ యూనివర్సిటీతో పాటు 38 ఇంజనీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూల్స్, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో కేటాయించిన సీట్లను కోటాలో కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌లపై ఉన్న బ్యాంకు లావాదేవీలను ఐటీ పరిశీలిస్తోంది. కన్వీనర్ కోటా సీట్లను ప్రైవేట్ వ్యక్తులకు మల్లారెడ్డి యాజమాన్యం కోట్లకు అమ్ముకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలున్నాయి. ఈ క్రమంలోనే మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌ల బ్యాంకు లావాదేవీలను ఐటీ పరిశీలిస్తోంది.