టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. అమెరికాలో అమెజాన్, మెటా, ట్విట్టర్ వంటి టెక్ సంస్థలు చేపట్టిన మూకుమ్మడి ఉద్యోగుల తొలగింపు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా పనితీరు బాగా లేదనే కారణం చూపుతూ దాదాపు 10 వేల మంది ఉద్యోగులపై (తన శ్రామిక శక్తిలో 6 శాతం) వేటు వేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
న్యూ ర్యాంకింగ్, పనితీరు మెరుగుదల ప్రణాళిక ద్వారా 10 వేల మంది ఉద్యోగులను తగ్గించుకొనే ప్లాన్‌లో ఆల్ఫాబెట్ ఉన్నదని, ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుందని ‘ది ఇన్ఫర్మేషన్’ నివేదిక పేర్కొన్నది. పనితీరు సక్రమంగా లేని వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపడంలో ఈ కొత్త పనితీరు నిర్వహణ వ్యవస్థ మేనేజర్లకు సాయపడుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు కంపెనీ యాజమాన్యం నుంచి మేనేజర్లకు తగిన ఆదేశాలు వెళ్లాయని నివేదించింది.
ఈ ఉద్యోగులంతా ప్రస్తుతానికి హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నారు. ఉద్యోగం తొలగింపు తర్వాత 60 రోజులు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆలోగా మరొక ఉద్యోగం చూసుకొని, సంబంధిత కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో హెచ్-1బీ పొందకపోతే అమెరికాను వీడాల్సి ఉంటుంది. వీరిలో చాలా మంది ఇప్పటికే గ్రీన్‌కార్డు మంజూరు కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు.
గ్రీన్‌కార్డుల మంజూరులో ఆలస్యం కారణంగా హెచ్-1బీపై కొనసాగుతున్న భారతీయ ఉద్యోగులపై తొలగింపు తీవ్ర ప్రభావం చూపుతున్నది. అటు గ్రీన్‌కార్డు మంజూరు కాక, ఇటు హెచ్-1బీ వీసా టైమ్ అయిపోతే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. 2020లో గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకొన్న భారతీయులు 195 ఏండ్లు వరకు చూడాల్సి ఉంటుందని యూఎస్ కాంగ్రెస్ నివేదిక ఇప్పటికే పేర్కొన్నది. ఇప్పటికే గ్రీన్‌కార్డు క్యూలో భారతీయులు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు.