తెలంగాణలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా వైసిపి నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 100 కోట్లు తాను సమకూరుస్తానని రఘురామ చెప్పినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఈ వ్యవహారంలో విచారించేందుకు రఘురామకృష్ణంరాజుకు నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామరాజు దిగిన ఫొటోలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిట్ అధికారుల దృష్టి ఆయనపై పడినట్లు భావిస్తున్నారు. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది
మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తునకు సహకరించని కీలక అనుమానితులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎవరైతే సీట్ విచారణకు హాజరుకాని కీలక నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంతోష్‌తో పాటు కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్‌పై కూడా కేసులు నమోదు చేశారు.
కస్టడీ పొడిగింపు పిటిషన్ కొట్టివేత
ఇలా ఉండగా, ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిల కస్టడీ 10 రోజుల పాటు పొడగింపు కావాలని సిట్ ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కస్టడీ పొడిగింపు పిటీషన్ ను కొట్టేసింది. మరోవైపు నిన్న అంబర్ పేట న్యాయవాది ప్రతాప్ కు సిట్ నోటీసులు ఇవ్వగా దానిపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. దీనితో తదుపరి ఆదేశాల వరకు ప్రతాప్ ను సిట్ అరెస్ట్ చేయొద్దు అంటూనే రేపు సిట్ విచారణకు మాత్రం ప్రతాప్ హాజరు కావాలని ఆదేశించింది.
కాగా గతంలో నిందితుల బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీనితో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే బెయిల్ విషయం హైకోర్టులో పిటిషన్ వేయాలని సుప్రీం తెలిపింది. రెండు రోజుల్లో వారు హైకోర్టులో బెయిల్ పై పిటీషన్ వేసే అవకాశం ఉంది.