‘‘అధ్యక్షుడు షీ జిన్పింగ్ దిగిపోవాలి’’.. ‘‘స్టెప్డౌన్ చైనా కమ్యూనిస్టు పార్టీ’’, ‘‘అన్లాక్ చైనా’’.. ‘‘అన్లాక్ షిన్జియాంగ్’’.. ‘‘పీసీఆర్ టెస్టులు వద్దంటే వద్దు’’ అంటూ చైనీయులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ‘జీరో కొవిడ్ పాలసీ’తో నెలల తరబడి లాక్డౌన్లలో మగ్గిపోయిన ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
గురువారం షిన్జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరువ్కీలో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది ఆహుతవ్వడంతో ప్రజాగ్రహానికి బీజం పడింది. ఆ భవనంలోని ఫ్లాట్ల తలుపులకు ప్రభుత్వం చైన్లతో తాళాలు వేసిందని.. దాంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేక వారు చనిపోయారని, మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆందోళనకారులు పేర్కొన్నారు.
ఆ ఘటన తర్వాత చైనా ప్రధాన నగరాల్లో క్రమంగా ఆందోళనలు ఆరంభమయ్యాయి. ఉరువ్కీలో శుక్రవారం శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనల్లో వందల మంది ‘హాన్’ వర్గం చైనీయులు, వుయ్ఘర్ ముస్లింలు పాల్గొన్నారు. వారి నిరసనను అణచివేసేందుకు పోలీసులు లాఠీలను ఝుళిపించారు.
ఈ వీడియోలు చైనా సోషల్మీడియా, ట్విటర్లో వైరల్ అయ్యాయి. ఆదివారం ఉదయానికి ఆ నిరసనలు బీజింగ్, షాంఘై, జిన్జియాంగ్ వ్యాప్తంగా విస్తరించాయి. దీంతో కొంత వెనక్కి తగ్గిన చైనా సర్కారు షిన్జియాంగ్లో ‘జీరో కొవిడ్’ లక్ష్యాన్ని సాధించామని, అక్కడ దశల వారీగా లాక్డౌన్ను సడలిస్తామని ప్రకటించింది.
ఉరువ్కీ ప్రాంతంలో శనివారం దాకా తెలుపురంగు పీపీఈ కిట్లు ధరించిన 100 మంది పోలీసులు మోహరించగా.. ఆదివారానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. బీజింగ్, షాంఘైల్లోనూ భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనలను ఎక్కడికక్కడ కఠినంగా అణచివేసే చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా.. ఆందోళనకారులు ఖాళీ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వాటిపై ఎలాంటి రాతలు ఉండడం లేదు. 2020లో హాంకాంగ్ విలీన సమయంలో ఆందోళనల్లో ప్రభుత్వ వ్యతిరేక రాతలను చైనా సర్కారు నిషేధించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు వేస్తోంది. దీంతో తాజా ఆందోళనల్లో పౌరులు ఖాళీ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు.
చైనా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కొవిడ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం ఉదయానికి (గడిచిన 24 గంటల్లో) 39,501 కొత్త కేసులు నమోదయ్యాయని చైనా వైద్య శాఖ వెల్లడించింది. నాలుగు రోజులుగా కేసుల సంఖ్య 35 వేలకు పైనే ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. చైనాలో ఉధృతి పెరగడం గమనార్హం. ఆదివారం ఒక్క షాంఘైలోనే 4,700 కేసులు నమోదయ్యాయి.