తన పాదయాత్ర సందర్భంగా వరంగల్ జిల్లాలో సోమవారం టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి జరపడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం `ప్రగతి భవన్ ముట్టడి’కి బయలుదేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిలను అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్‌కు తరలించారు. ఆమెను పరామర్శించేందుకు షర్మిల తల్లి విజయమ్మ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
దీంతో.. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయమ్మ లోటస్‌పాండ్‌లోని నివాసంలో నిరాహార దీక్షకు దిగారు. తన కూతుర్ని చూసేందుకు వెళుతుంటే అడ్డుకున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా అని ఆమె ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. షర్మిల అరెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ప్రగతి భవన్‌ను షర్మిల ముట్టడించనున్నారన్న సమాచారంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించారు. షర్మిల డోర్ లాక్ చేసుకుని కారు లోపలే ఉన్నారు. దీంతో.. షర్మిల ఉన్న కారును క్రేన్‌తోనే లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు షర్మిలను కారుతో సహా తరలించారు.
పీఎస్‌కు వెళ్లగానే.. బలవంతంగా షర్మిల కారు డోర్లు పోలీసులు తెరిచారు. పోలీసులు షర్మిలను కారు నుంచి బయటకు లాగేశారు. అనంతరం.. ఆమెను పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు. షర్మిల అరెస్ట్‌తో ఎస్ఆర్నగర్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఆర్నగర్ పీఎస్ దగ్గర వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
షర్మిల వరంగల్ జిల్లాలో చేసిన పాదయాత్ర రణరంగంగా మారింది. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. షర్మిల క్యారవాన్‌కు నిప్పు పెట్టారు. పాదయాత్రను అడ్డుకునేందుకు అడుగడునా ప్రయత్నించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు.
షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలించారు. దానితో నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేసిన పాదయాత్రకు అనుమతిని తిరిగి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో వైఎస్సార్టీపీ లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేసింది.
వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని హైకోర్టు, పోలీసులను ఆదేశించింది. అయితే సీఎం కేసీఆర్ పై మతపరమైన, రాజకీయ అంశాలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, షర్మిల అరెస్ట్‌పై వైఎస్ విజయలక్ష్మి మండిపడ్డారు. వైఎస్ షర్మిల చేసిన నేరం ఏంటి? అని వైఎస్ విజయలక్ష్మి ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ‘‘మేం ప్రభుత్వాలు నడపలేదా?.. మాకు పోలీసులు కొత్తకాదు. పోలీసులు ఇలా చేయడం తప్పు కాదా?. వ్యక్తిగతంగా ఏం విమర్శ చేసిందో మీరే చెప్పండి. ప్రజలు చెప్పిన సమస్యలనే షర్మిల ప్రశ్నించింది’’ అని ఆమె విమర్శించారు.