ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన నిర్వహిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవిలో పూనం మాలకొండయ్యను నియమించారు.
ఒకప్పుడు సీఎంఓలో చక్రం తిప్పి, ప్రధాన కార్యదర్శిని సహితం లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీచేసి, వివాదాస్పదంగా మారడంతో ఢిల్లీకి బదిలీ అయిన ప్రవీణ్ ప్రకాష్ తిరిగి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాష్ట్రంలో పోస్ట్ సంపాదించ గలిగారు, రవాణా శాఖ కార్యదర్శిగా ప్రద్యుమ్నా, వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జ్‌గా వై. మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమీషనర్‌గా రాహూల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరిగా మహ్మద్ దివాన్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అసాధారణ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది. తిరిగి 2023 నవంబరు వరకు ఆయన పదవీకాలం పెంచాలని కేంద్రాన్ని మరోసారి అడిగినా, కేంద్రం అందుకు అంగీకరించకపోవడంతో మరొకరిని ఈ పదవిలో నియమించాల్సి వచ్చింది.
శ్రీలక్ష్మి, జవహర్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ జవహర్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. ఓబుళాపురం గనుల కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో.. సీఎస్ పోస్టు దక్కించుకునేందుకు ఆమెకు లైన్ క్లియర్ అయిందని ప్రచారం జరిగింది. అయితే ఆమెకు నిరాశే ఎదురైంది.
శ్రీలక్ష్మికి సీఎస్ పదవి రాకుండా జగన్ కోటరీలో కొందరు వ్యతిరేకించినట్లు ప్రచారం జరుగుతుంది. సామాజిక వర్గం, విధేయత, కడప జిల్లాకు చెందిన వారు కావడంతో జవహర్ రెడ్డి పట్లనే జగన్ సుముఖత వ్యక్తం చేసిన్నట్లు కనిపిస్తుంది.
జవహర్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. జవహర్ రెడ్డి 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన కంటే సీనియర్లయిన నీరభ్‌కుమార్ ప్రసాద్ (1987), పూనం మాలకొండయ్య (1988), కరికాల వలవన్ (1989) సీఎస్ పోస్టును ఆశించినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం… జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు.
సీఎస్‌గా పదవీ విరమణ అనంతరం సమీర్‌శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించారు. దీంతో పాటు సమీర్‌శర్మను ముఖ్యమంత్రి జగన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.