ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటకు రావడం విదితమే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై, సిఎం కెసిఆర్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో షర్మిలపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తొలిసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బిజెపి కోవర్టు షర్మిల అని విమర్శించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది.
‘తాము వదిలిన “బాణం”… తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”’ అని తొలుత షర్మిలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ పై షర్మిల ఘాటుగా స్పందించారు. ‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీలు అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’ అని షర్మిల విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలపై కవిత మరోసారి అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు.
‘ అమ్మా.. కమల బాణం… ఇది మా తెలంగాణం… పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం… మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు… నేడు తెలంగాణ రూటు… మీరు కమలం కోవర్టు… ఆరేంజ్ ప్యారేట్టు… మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను… రాజ్యం వచ్చాకే రాలేదు నేను… ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ” కవిత” ను నేను !’ అంటూ షర్మిలపై విమర్శలు గుప్పించారు.
కాగా, షర్మిల లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ఆలస్యం అవ్వటానికి కారణం వైఎస్సార్ అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. షర్మిల గతంలో చేసిన ప్రకటలను ప్రస్తావిస్తూ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ మహిళా నేతలు షర్మిల తీరును తప్పు బట్టారు. టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యల పైన ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.