పాఠశాలలకు వెళ్లే పిల్లల స్కూల్ బ్యాగులు చెక్ చేసిన ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు. ఆ బ్యాగుల్లో కండోమ్‌లు, సిగరెట్లు, లైటర్లు, మందు మిక్స్ చేసిన వాటర్ బాటిళ్లు, వైటనర్లు కనిపించడంతో వారి నోట మాట రాలేదు ఒకరిద్దరు విద్యార్థుల బ్యాగుల్లో గర్భ నిరోధక మాత్రలు కూడా కనిపించడం ఉపాధ్యాయులను మరింత షాకింగ్‌కు గురిచేసింది.
బెంగళూరులోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన పలు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. 8, 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థుల బ్యాగ్‌లలో ఇవి కనిపించాయి. విద్యార్థులు క్లాసులకు మొబైల్ ఫోన్లు తీసుకొస్తున్నారేమో అనే అనుమానంతో తనిఖీలు చేయగా, ఈ షాకింగ్ విషయం బయట పడింది.
వెంటనే అప్రమత్తమైన ఆ విద్యా సంస్థ కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్‌ను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థుల బ్యాగ్‌లను చెక్ చేయాలని ‘కర్ణాటక అసోసియేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ స్కూల్స్’ పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆ ఆకస్మిక తనిఖీల తర్వాత కొన్ని పాఠశాలల్లో ప్రత్యేకంగా పేరెంట్ – టీచర్ సమావేశాలను నిర్వహించారు. పిల్లల బ్యాగుల్లో గుర్తించిన వస్తువుల గురించి విని తల్లిదండ్రులు కూడా అదే రీతిలో షాక్ అయ్యారు. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పుల గురించి కొంత మంది తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
‘పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బ్యాగ్‌లో కండోమ్ కనిపించింది. ఇదేంటని ఆ యువతిని ప్రశ్నిస్తే.. నాకు తెలియదు, అదంతా నా స్నేహితుల పనే అంటూ మాట దాటేస్తోంది’ అని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. బెంగళూరులోని 80 శాతం స్కూళ్లలో తనిఖీలు పూర్తయ్యాయని ఆయన చెప్పారు.
‘ఈ విద్యార్థులకు సస్పెండ్ లాంటి శిక్షలు విధించకుండా, కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. విద్యార్థులకు మేం రెగ్యులర్‌గా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అయితే, తల్లిదండ్రుల మద్దతు కూడా అవసరం. పేరెంట్స్ తమ విద్యార్థుల ప్రవర్తనపై దృష్టి సారించి, వాళ్లకు మంచి చెడులు నేర్పించాలి’ అని చెబుతున్నారు.