ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సమయంలో క్రయోజనిక్ ఇంజన్లను అభివృద్ధి చేస్తున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త నంబి నారాయణ్ విదేశాలకు దేశ రహస్యాలు అమ్మేశారంటూ పోలీసులు ఆయనపై కేసు పెట్టారు.
ఈ తప్పుడు కేసు కారణంగా ఆయన కెరీర్ నాశనం కావడంతో పాటు భారత దేశం రెండు దశాబ్దాల పాటు క్రయోజనిక్ ఇంజన్లను తయారు చేసే వీల్లేకుండా పోయింది. ఆ తర్వాత ఇది తప్పుడు కేసని తేలడంతో ఆయనకు క్లీన్ చిట్ లభించింది.
అయితే ఈ కేసులో కుట్రకు పాల్పడ్డ నలుగురు పోలీసు అధికారులపై సీబీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసులో అప్పట్లో కుట్రకు పాల్పడ్డ గుజరాత్ మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి జయప్రకాష్, మరో ఇద్దరు పోలీసు అధికారులు విజయన్, దుర్గాదత్ భారత్ కు క్రయోజనిక్ పరిజ్ఞానం అందకుండా చేయాలన్న విదేశీ కుట్రలో భాగస్వాములయ్యారని సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.
దీంతో ఈ నలుగురు కేరళ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతే కాదు ఈ కేసును తిరిగి కేరళ హైకోర్టుకే బదిలీ చేసింది. నంబి నారాయణ్ కేసులో ఆయనపై కుట్రకు పాల్పడ్డ నలుగురు పోలీసు అధికారులు దీంతో పాటు దేశానికి క్రయోజనిక్ పరిజ్ఞానం రెండు దశాబ్దాలు అందకుండా జరిగిన కుట్రలో భాగస్వాములైనట్లు సీబీఐ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోనూ ఇదే వాదన వినిపించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు..ఈ నలుగురు అధికారుల ముందస్తు బెయిల్ రద్దు చేసి నాలుగు వారాల్లోగా ఈ కేసును తేల్చాలంటూ కేరళ హైకోర్టుకు గడువిచ్చింది. మరోసారి వీరి బెయిల్ దరఖాస్తులపై విచారణ జరపాలని, అయితే ఆ లోపు మాత్రం అరెస్టు చేయొద్దంటూ సీబీఐకి సూచించింది.