కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కవిత పేరును చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా కవితకు సీబీఐ నోటసులు జారీ చేసింది. ఢిల్లీ లేదా హైదరాబాద్‌ల ఎక్కడైనా కవిత విచారణకు హాజరుకావొచ్చని సీబీఐ పేర్కొంది.
ఈ నెల 6న హైదరాబాద్‌లో కవిత విచారణకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరును ఈడీ పొందుపర్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో కవిత పాత్ర ఏంటనే అంశంపై విచారణ చేసేందుకు సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది.
మోడీ రోజుల క్రితం సిబిఐ కోర్టులో దాఖలు చేసిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పలు అంశాలను పొందుపర్చింది. శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్ అరోరా నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ అనే కంపెనీ నుంచి ఆప్ నాయకుల తరపున విజయ్ నాయర్ రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని అమిత్ అరోరా వెల్లడించారు.
దర్యాప్తును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కేసును ఏజెన్సీకి అప్పగించిన తర్వాత 36 మంది తమ 176 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారని రిపోర్టులో పేర్కొంది. 170 సెల్ఫోన్లలో 17 సెల్ఫోన్ల నుంచి డేటాను తిరిగి పొందగలిగామని, అన్ని ఫోన్లు దొరికి ఉంటే ఈ కేసులో చేతులు మారిని మరిన్ని ముడుపులు వెలుగులోకి వచ్చేవని తెలిపింది. ఇతర ముఖ్యమైన వ్యక్తుల ప్రమేయం మరింత స్పష్టంగా బయటపడి ఉండేదని రిపోర్టులో ఈడీ పేర్కొంది.