ప్రీలాంచ్ ప్రాజెక్టుల పేరుతో 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలపై సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను హైదరాబాద్ సిసిఎస్, ఈఓడబ్లూ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న లక్ష్మీనారాయణ ప్రీ పేరుతో పలువురు అమాయకుల వద్ద నుంచి రూ.వందల కోట్లు వసూలు చే శాడు.
హైరైజ్ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నానని, ఇందులో 1,200, 1,700 స్కేర్ ఫీట్లు ఉంటుందని ప్రచారం చేసుకున్నాడు. అమీన్పూర్లోని సాహితీ శార్వాణి ఎలైట్ పేరుతో ప్రాజెక్ట్ చేస్తున్నానని చెప్పి 1,700 మంది వద్ద నుంచి రూ. 539 కోట్లు వసూలు చేశాడు. ఇక్కడ చేపడుతున్న ప్రాజెక్ట్ 23 గుంటల్లో ఉంది, దీనికి హెచ్ఎండిఎ, జిహెచ్ఎంసి నుంచి ఎలాంటి అనుమతి లేదు.
అంతేకాకుండా ప్రాజెక్ట్ కనీసం ప్రారంభించక పోవడంతో బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయడంతో వారు కట్టిన డబ్బులకు 15 నుంచి 18 శాతం వడ్డీ కలిపి చెక్కులు ఇచ్చాడు. కానీ ఈ చెక్కులను బాధితులు బ్యాంక్లో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి.
హైదరాబాద్లో కూడా హైరైజ్ బిల్డింగ్లు కడుతున్నామని చెప్పి 2,500 మంది వద్ద రూ. 900 కోట్లు వసూలు చేశాడు. కానీ ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకపోవడంతో బాధితులు సంస్థ ప్రధాన కార్యాలయం జూబ్లీహిల్స్లో గత కొంత కాలం క్రితం ధర్నా చేశారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన లక్ష్మీనారాయణ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 406,420,120(బి), రెడ్ విత 34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు రిమాండ్ విధించింది. పోలీసులు అరెస్ట్ చేయడంతో టిటిడి సభ్యత్వం కోల్పోనున్నాడు లక్ష్మీనారాయణ. అయితే అంతకుముందే స్వచ్ఛందంగా టిటిడి పాలకమండలి సభ్యత్వానికి లక్ష్మీనారాయణ రాజీనామా చేశాడు. రాజీనామా లేఖ ఆమోదించాలంటూ ఎపి ప్రభుత్వానికి పంపాడు.