సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస రావుకు పలువురు నేతలు, అధికారులతో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాస్ నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో కస్టడీని పొడిగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు శనివారం తోసిపుచ్చింది.
ఈ కేసులో చాలా పెద్ద స్థానాలలో ఉన్న వారిని, బడా లీడర్లను శ్రీనివాసరావుతో కలిపి విచారించాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసుతో ముడిపడిన దాదాపు 1100 కాల్స్ డేటాను పరిశీలన చేస్తున్నామని పేర్కొంది.
శ్రీనివాసరావుతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రను డిసెంబరు 1న దాదాపు 8 గంటల పాటు సీబీఐ ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించింది. విచారణకు శ్రీనివాస్ సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఆరుగురు సాక్షులను పిలిచి విచారణ జరిపామని వెల్లడించారు.
అయితే ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ శ్రీనివాస్ ఫోన్ నుంచి సేకరించిన 1,100 ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ను అనువదించి విశ్లేషించారా అని ప్రశ్నించారు. సీబీఐ తరఫు న్యాయవాది బదులిస్తూ ఇంకా చేయలేదని చెప్పారు.
తదుపరి కస్టడీ ఎందుకు పొడిగించాలని న్యాయమూర్తి ప్రశ్నించగా.. మరికొందరు సాక్షులను విచారణ జరపాల్సి ఉందని, ఆ క్రమంలో ఎదురుగా పెట్టి ప్రశ్నించడం కోసం శ్రీనివాస్ కస్టడీ కావాలని కోరారు. శ్రీనివాస్ మోసాలకు బాధితులుగా మారిన వారిలో ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు ఉన్నారని తెలిపారు.
కేవలం కన్‌ఫ్రంటేషన్ తప్ప కస్టడీ పొడిగించడానికి ఇంకేదైనా కారణం ఉందా అని ప్రశ్నించగా.. నిందితుడు తనను తాను సీబీఐలో జాయింట్ డైరక్టర్ ర్యాంక్ అధికారిగా చెప్పుకుని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డాడని గుర్తుచేశారు. ఎందుకు నకిలీ అధికారిగా అవతారమెత్తాడో తెలుసుకోవాల్సి ఉందని, ఆ క్రమంలోనే కస్టడీ పొడిగించాలని కోరారు.
కేసులో సాక్షులందరూ హైదరాబాద్‌కు చెందినవారే ఉన్నారని, వారిని ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించడం వల్ల జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. అయితే, న్యాయమూర్తి నిందితుడికి సీబీఐ కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తదుపరి కన్‌ఫ్రంటేషన్ చేయాలనుకుంటే జైలు నుంచి కూడా చేయవచ్చని, దర్యాప్తు సంస్థ చట్టం పరిధిలోనే దర్యాప్తు చేయాలని వ్యాఖ్యానించారు. శ్రీనివాస్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తిహార్ జైలుకు తరలించాలని ఆదేశించారు.