హిజాబ్ వద్దంటూ సుమారు మూడు నెలలుగా ఇరాన్ మహిళలు చేస్తోన్న నిరసనలకు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. హిజాబ్ ధరించని మహిళలపై ఉక్కుపాదం మోపుతున్న మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను (నైతిక విభాగం పోలీసులు) రద్దు చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమీని అనే 22 ఏళ్ల కుర్దు యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చిత్రహింసలతో వారి కస్టడీలోనే అమీని సెప్టెంబర్ 16న చనిపోయారు. దీంతో నాటి నుంచి హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
రాజధాని టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ఆందోళనలను అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశించింది. మొరాలిటీ పోలీసులు జరిపిన కాల్పుల్లో గత రెండు నెలల్లో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు కూడా చనిపోయారు.
ఎంతమంది చనిపోతున్నా ఇరాన్ మహిళలు వెనక్కు తగ్గలేదు. మహిళలకు రోజురోజుకూ మద్దతు పెరిగి ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నిరసనలు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండటంతో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొరాలిటీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసింది.
మొరాలిటీ పోలీసింగ్‌కు న్యాయవ్యవస్థతో సంబంధం లేదని అందుకే రద్దు చేస్తున్నామని అటార్నీ జనరల్ మొహ్మద్ జాఫర్ మొంటాజెరి ప్రకటించారు. ఇరాన్లో షరియా చట్టం అమల్లో ఉంది. ఏడేళ్లు దాటిన బాలికలు, మహిళలు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటిస్తూ జుట్టును పూర్తిగా కప్పి ఉంచేలా హిజాబ్ ధరించాలి. షరియా చట్టం అమలు కోసం 2005లో మొరాలిటీ పోలీసింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక పోలీస్ విభాగాన్ని గస్త్ ఎ ఇర్షాద్‌గా పిలుస్తారు. హిజాబ్ ధరించేలా చూడటంతో పాటు సరైన డ్రెస్ కోడ్ పాటించనివారిని అరెస్ట్ చేసే అవకాశం కల్పించడంతో మొరాలిటీ పోలీసింగ్ విభాగం కీలకంగా మారింది.
అరెస్ట్ చేయడంతో పాటు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తుండటం వల్లే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అమినీ మరణంతో నిరసనల అగ్నిపర్వతం బద్దలవడంతో ఇరాన్ చివరకు తలొగ్గింది.