బలవంతపు మత మార్పిడులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత మార్పిడులను తీవ్రమైన సమస్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. సోమవారం దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిల్ మెయింటెనెన్స్‌పై అభ్యంతరాలను తిరస్కరించింది. ‘ప్రతి స్వచ్ఛంద సంస్థ లేదా మంచి పనిని స్వాగతించాల్సిందే, కానీ ఉద్దేశాలను మాత్రం తనిఖీ చేయాల్సిందే..’ అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
మందులు, ఆహార ధాన్యాలు అందించి ఇతర మతాల్లోకి మారేలా ప్రజలను ప్రలోభపెట్టడం చాలా తీవ్రమైన సమస్య అని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు. ‘ప్రత్యేకమైన వ్యక్తులకు సహాయం చేయాలని మీరు విశ్వసిస్తే వారికి సహాయం చేయండి. అంతే కానీ అది మత మార్పిడి కోసం ఉండకూడదు. ప్రలోభపెట్టడం చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా తీవ్రమైన సమస్య. మన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధం. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ భారతదేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలి..’ అని జస్టిస్ ఎంఆర్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు.
న్యాయమూర్తులు ఎంఆర్ షా, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై ఈ అంశంపై వివరణాత్మక సమాచారాన్ని అందించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి బలవంతపు మత మార్పిడులకు సంబంధించిన డాటాను సేకరిస్తున్నట్లు ఆయన కోర్టుకు విన్నవించారు. ఇందు కోసం వారం గడువు కావాలని కోర్టును కోరారు. దాంతో తదుపరి విచారణను ఈ నెల 12 కు కోర్టు వాయిదా వేసింది.
బహుమతులు ఇవ్వడం, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం, బెదిరింపులకు దిగడం, మోసపూరితంగా ప్రలోభపెట్టడం ద్వారా జరిగే మత మార్పిడులను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మత మార్పిడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని, అలా కుదరని పక్షంలో ఈ నేరాన్ని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) లో చేర్చాలని పిటిషన్లో ఆయన కోర్టుకు విన్నవించారు.