తెలంగాణాలో కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయడం కోసమై 80 మందితో ఏఐసీసీ ఏర్పాటు చేసిన జంబో కమిటీలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు సీనియర్ నేతలు కమిటీల కూర్పు పట్ల ఆగ్రహం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ, పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ కార్యవర్గంకు రాజీనామాలు చేసారు.
తాజాగా, కోవర్టుల వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహా విమర్శలు గుప్పించారు. గత ఎనిమిదేళ్ళుగా కాంగ్రెస్‌లో కొనసాగుతోన్న కోవర్టు రోగం ప్రమాదకరంగా మారిందని పేర్కొంటూ కోవర్టులు కాంగ్రెస్‌లోనే ఉంటూ కాంగ్రెస్ పాట పాడుతూ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని ఆయన విమర్శించారు.
ముఖ్యంగా కాంగ్రెస్ బలోపేతం కోసం కష్టపడుతున్న బలహీనవర్గాలకు పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏమిటో తెలియని వారికి పార్టీ పదవుల్లో ఎలా స్థానం కల్పించారని ఆయన ప్రశ్నించారు. అసలైన కాంగ్రెస్ వాదులకు పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.
ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉత్సాహంగా పనిచేశారని చెబుతూ పంపకానికి వచ్చేసరికి పార్టీ కోసం కష్టపడినవారికి, డబ్బులు ఖర్చు పెట్టుకున్నవారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇంతమంది జనరల్ సెక్రటరీలు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంతమంది జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లను నియమించలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ సిద్దాంతాలు, చరిత్ర తెలియని వారికి కూడా పదవులు ఇస్తున్నారు. బీసీలు, మైనార్టీలు, దళిత నేతలకు పార్టీలో అసలు గుర్తింపు దక్కడం లేదని అంటూ మండిపడ్డారు.