బ్రిటన్ లో భారత్కు చెందిన నర్స్ గా పనిచేస్తున్న ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. లండన్ సమీపంలోని నార్తంప్టన్ ప్రాంతంలో కెట్టెరింగ్లో ఉన్న తమ అపార్ట్మెంట్ భవనంలో కత్తిపోటు గాయాలతో ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు.
కేరళకు చెందిన అంజు (42), ఆమె ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించడం కలకలం రేగింది. అంజు అక్కడకక్కడే చనిపోగా.. ఆ పిల్లలిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేరళలోని కొట్టాయం నుంచి బ్రిటన్కు వెళ్లిన అంజు తన భర్త సజు, ఆరేళ్ల బాబు, నాలుగేళ్ల పాపతో కలిసి ఉంటోంది.
పిల్లలు సహా అంజు హత్యకు గురికావడంతో ఆమె భర్త సజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సజు శరీరంపై కూడా స్వల్ప గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. కుమార్తె హత్యకు గురైన విషయం తెలిసి కొట్టాయంలోని అంజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అంజును ఉరేసి చంపినట్టు పోస్ట్మార్టంలో వెల్లడైనట్టు పోలీసులు చెప్పారని వారు తెలిపారు. అంతేకాదు. తమ అల్లుడు సజు కోపిష్టే కానీ, హత్యలు చేసేంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని అంజు తల్లి వాపోయారు. గతంలోనూ అంజు, మనవడ్ని దారుణంగా కొట్టిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు.
కన్నూర్కు చెందిన సజుతో 2012లో అంజుకు వివాహం జరిగింది. సజు మొదట్లో సౌదీలో పని చేసేవాడు. వివాహం అనంతరం కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే పిల్లలు పుట్టారని, రెండేళ్ల కిందటే యూకేకు వచ్చారని అంజు తల్లిదండ్రులు తెలిపారు. సౌదీలో ఉద్యోగం చేసిన సజు.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడని తెలిపారు.