సామాన్య ప్రజలకు అమితమైన పౌష్టికాహారంగా భావించే కోడిగుట్ట ధరలు భగ్గుమంటున్నాయి. దానితో గుడ్డు తినాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్నమొన్నటి వరకు నాలుగైదు రూపాయలున్న గుడ్డు ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. బహిరంగ మార్కెట్లో ఏకంగా ఏడు రూపాయలకు పెరగడంతో సామాన్యులు అటువైపు చూడాలంటేనే భయపడుతున్నారు
ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెపుతుంటారు. ఇక కరోనా సమయంలో కోడి గుడ్లు వినియోగం మరింత పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారంతా కోడిగుడ్డు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేయడం తో ప్రతి ఒక్కరు కూడా రోజు రెండేసి , మూడేసి గుడ్లు తిన్నారు.
ఆ తర్వాత కూడా కొంతమంది అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కోడి గుడ్డు కొనాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గుడ్డు ధర భారీగా పెరిగింది. ఏపీలో 100 గుడ్ల ధర గరిష్ఠంగా రూ. 547 పలుకుతోంది.
ఫామ్‌గేట్‌లో గుడ్డు రేటు రూ. 5.34 మాత్రమే. అయినప్పటికీ హోల్‌సేల్‌గా డజను గుడ్ల ధర రూ. 78గా ఉంది. దీంతో రవాణా ఖర్చులు కలుపుకుని ఒక్కో గుడ్డును వ్యాపారులు రూ. 7కు విక్రయిస్తున్నారు. గత నెలలో డజను గుడ్ల ధర రూ. 66గా ఉండగా ఇప్పుడు గుడ్డుకు రూపాయి పెంచి విక్రయిస్తున్నారు.
కోళ్ల దాణా ధరలు పెరగడం, విద్యుత్ చార్జీలు, కూలి రేట్లు కారణంగానే ధరలు పెరిగినట్టు ఫామ్ యజమానులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపుగా 27 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో ఒక్క ఏపీలోనే 5 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.