ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల ప్రసక్తి లేదని అధికార పక్ష నేతలు స్పష్టం చేస్తున్నా, ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మాత్రం తగ్గడం లేదు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ శ్రేణులకు చెబుతూనే ఉన్నారు.
తాజాగా, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైసిపి అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణం రాజు జోస్యం చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటు, లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెబుతున్నారు.
కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే జరగవచ్చునని ఆయన పేర్కొన్నారు. 2024లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగవనేది ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే తేటతెల్లమవుతుందని చెప్పారు.
వంద రోజులే ఎన్నికలకు సమయమని చెబుతూ ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కాసింత గౌరవం ఇచ్చి సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల ఖర్చు నిమిత్తం ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి కొంత నగదును ఇవ్వాలని కోరినట్లు తెలిసిందని చెప్పారు. ఎన్నికలకు ఎంత ఖర్చైనా మిగిలిన మొత్తాన్ని తానే భరిస్తానని వారికి హామీ ఇస్తున్నట్లు తనకున్న సమాచారముందని పేర్కొన్నారు.
అయితే ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి అడిగిన మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేనట్లు తెలిసిందని తెలిపారు. తమ పార్టీ పెద్దలు మూటలు సిద్ధం చేసుకుని ముందస్తు ఎన్నికలకు సమాయాత్రమవుతున్నారని ఆరోపించారు.
అయితే కొద్ది మంది ఎమ్మెల్యేలు అవినీతి సొమ్ము సంపాదించి ఉంటే సంపాదించి ఉండవచ్చునన్న ఆయన, వారు మళ్లీ నెగ్గే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. మూటలు, మాటల రాజకీయాలకు ఈసారి ప్రజలు పడిపోరని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే లు ముందస్తుగా పార్టీ నాయకత్వానికి మూటలు అప్పజెప్ప వద్దని ఆయన హితవు చెప్పారు.
ఇలా ఉండగా, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక యాప్ ను తనవంతుగా సిద్ధం చేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు వెల్లడించాయిరు. ఈ యాప్ లో ఆధార్ నెంబర్ నమోదు చేస్తే, ఓటరు జాబితాలో పేరు ఉన్నది.. లేనిది సునాయాసంగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఐటీ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు.