దేశంలో మళ్లీ రూ. 1000 కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నట్లు కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. రూ. 2000 నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, 2023 జనవరి 1వ తేదీ నుంచి రూ. 1000 నోట్లు చెలామణిలోకి రానున్నాయన్నది ఆ వీడియో సారాంశం.
2018-19 తర్వాత నుంచి రూ. 2000 కరెన్సీ నోట్ల ముద్రణకు కొత్త ఇండెంట్ ఏదీ పెట్టలేదని కేంద్రం ప్రకటించిన తర్వాత ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ దీనిపై స్పష్టమైన వివరణ ఇస్తూ ఇవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది.
రూ. 1000 నోటుపై అసత్య ప్రచారం చేస్తున్నారని , వీటిని నమ్మవద్దని ప్రజలను హెచ్చరించింది. జనవరి 1 నుంచి రూ 1000 నోట్లు అందుబాటులోకి వస్తాయని, రూ. 2000 నోట్లు బ్యాంకులకు వాపసు వెళ్లిపోతాయంటూ సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోందని, ఇదంతా అవాస్తవమని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇచ్చింది.
అటువంటి మెసేజ్లను ఫార్వార్డ్ చేయవద్దని కూడా ప్రజలకు సూచించింది. రూ. 2000 నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే రూ. 2000 నోట్లను దశలవారీగా ఉపసంహరించాలన్న డిమాండు ఇటీవల రాజ్యసభలో కూడా ప్రస్తావనకు వచ్చింది.
రూ. 2000 నోట్లు దాచుకున్న ప్రజలు వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రెండేళ్లు వ్యవధి ఇవ్వాలని బిజెపి ఎంపి సుశీల్ కుమార్ మోదీ రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు.
రూ. 2000 నోట్ల కొందరు భారీ మొత్తంలో దాచిపెడుతున్నారని, డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఈ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రూ. 2000 నోట్లు నల్ల ధనానికి ప్రతిరూపంగా మారిపోయాయంటూ కూడా ఆయన ఆరోపించారు.