కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాలు బలోపేతం చేయాల్సిన అవసరముందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. మంగళవారం ఢిల్లీ సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో మోడీతో విజయన్ భేటీ అయ్యారు.
కరోనా కొత్త వేరియంట్‌తో ముప్పు పొంచివుందన్న కథనాల నేపథ్యంలో మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన సన్నాహాలపై ఇరువురు చర్చించారు. కరోనా తీవ్రతను ఎదుర్కోవడానికి కేరళ ప్రభుత్వ సన్నద్ధతను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఉన్న జల జీవన్ మిషన్, జాతీయ రహదారులు వంటి కేంద్ర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
కేరళలో జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి విజయన్ తెలిపారు. కేరళకు చెందిన ప్రసిద్ధ నృత్యరూపకం ‘కథాకళి’ నమూనా ప్రతిమను ఈ భేటీ సందర్భంగా మోదీకి విజయన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విపి ఆనందం కూడా పాల్గొన్నారు.