జనవరి 1, 2023 నుండి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుండి వచ్చే విమాన ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణానికి ముందు వారు తమ రిపోర్టులను ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించారు.
కరోనా కేసులు విదేశాల్లో మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. రెండు సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న పరిస్థితులు మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతో ముందు నుంచే నివారణ చర్యలు చేపట్టింది. పౌరులంతా మాస్కులు ధరించాలని సూచించింది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రానున్న 40 రోజులు భారత్ కు కీలకమని కేంద్రం ఇటీవలే వెల్లడించింది. జనవరిలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు చేయడం, ఐసోలేట్ చేయడం తదితర ఏర్పాట్లపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది
మరోవైపు ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు చేయడం, ఐసోలేట్ చేయడం వంటి ఏర్పాట్లపైనా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సమీక్షించనుంది. అక్కడ సన్నద్ధతపై మాండవీయ ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే చైనా నుంచి వచ్చే వారు 48 గంటల ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తోనే తమ దగ్గర ల్యాండ్ అవ్వాలని అమెరికా ఇప్పటికే ఆదేశించింది.
‘ఇంతకు ముందు కరోనా వేవ్ తూర్పు ఆసియాను తాకిన 30-35 రోజుల తర్వాత భారతదేశంలో వైరస్ వ్యాప్తి మొదలవ్వడం గమనించవచ్చు… ఇది ఒక ట్రెండ్.. దీని ప్రకారం జనవరిలో కేసులు పెరిగే అవకాశం ఉంది’ అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇన్ఫెక్షన్ తీవ్ర తక్కువగా ఉంటుందని, ఒక వేళ నాలుగో వేవ్ వచ్చిన ఆస్పత్రులు చేరే బాధితులు, మరణాలు కూడా స్వల్పంగా ఉంటాయని భావిస్తున్నారు.