అయ్యప్పస్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్‌ను ఎట్టకేలకు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్పస్వామిని ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని అయ్యప్ప మాలాధారులు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లలో భైరి నరేష్‌పై సులు నమోదయ్యాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా భైరి నరేష్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. కరీంనగర్ వెళ్తుండగా వరంగల్‌లో అరెస్ట్ చేశారు. భైరి నరేష్ అరెస్ట్‌పై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. నరేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అయ్యప్పస్వాములు ఆందోళనలు విరమించాలని ఎస్పీ కోరారు.
భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని రెండు రోజులుగా అయ్యప్పస్వాములు ఆందోళణలు చేస్తుండటంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అయ్యప్పస్వాములు ఆందోళనలు చేస్తున్న క్రమంలో.. దానిని వీడియో చిత్రీకరించడానికి వచ్చిన భైరి నరేష్ అనచరుడు బాలరాజును పొట్టుపొట్టు కొట్టారు.
జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద అయ్యప్ప స్వామి దీక్షపరులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారి నిరసనకు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దుతు తెలిపారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కోట్లాది మంది భక్తులు అయ్యప్పస్వామిని కొలుస్తారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. దేశంలో మతతత్వ స్వేచ్ఛ హక్కు ఉందని, ఇతర మతస్తులను కించపరిచే విధంగా మాత్రం వ్యవహరించకూడదని సంజయ్ కుమార్ సూచించారు.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యల సంఘటన పై సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అతని పై కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి శిక్షించాలంటూ సూర్యాపేట, హైదరాబాద్ , విజయవాడ రహదారి NH 65 పై అయ్యప్ప స్వాములు ఆందోళన చెపట్టారు. దీంతో అక్కడ ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
హిందు దేవుళ్లని కించపర్చేలా మాట్లాడిన బైరి నరేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ లో అయ్యప్ప భక్తుల బైక్ ర్యాలీ- రాస్తారోకో నిర్వహించారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో నరేష్ పై ఫిర్యాదు చేశారు.