ప్రతి ఏడాది జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించారని తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అయితే, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇవ్వమంటే, సాక్షి దినపత్రిక క్యాలెండర్ ను ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
గత మూడేళ్లు గడిచిపోయాయని, ఇది నాల్గవ ఏడాది. అయినా జాబ్ క్యాలెండర్ ఊసే లేదని ధ్వజమెత్తారు. డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. కానీ నిర్వహించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో 50 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో 6000 స్కూళ్లను మూసి వేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు అని అనడమే తప్పితే, కొత్తగా ఒక్క టీచర్ ను నియమించలేదు. ప్రస్తుతం నాలుగు నుంచి 5వ తరగతి విద్యార్థుల సీబీఎస్ఈ సిలబస్ జన్యునుగా పరీక్షలు రాసి ఫస్టు క్లాసులో పాసైన తమకే కన్ఫ్యూజన్ గా ఉందని వివరించారు.
ఇక పరీక్షలు రాయకుండానే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యామని చెప్పేవారి పరిస్థితి ఏమిటో మనకు అర్థం కాదని విమర్శించారు. గతంలో ఎం ఈ డి, బీఈడీ లు చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి, ప్రస్తుత సీబీఎస్ఈ సిలబస్ ఆకలింపు చేసుకోవడానికి ఇబ్బందులు తప్పవని తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే నానా హింసలు పెట్టిందని అంటూ తాజాగా జగనన్న స్మార్ట్ ఆలోచనలో భాగంగా పది నిమిషాలు ఆలస్యంగా స్కూలుకు వచ్చే టీచర్ ఫోటో తీసి అప్లోడ్ చేయాలట అని ఎద్దేవా చేశారు.
ఇక ఎలాగూ పది నిమిషాలు ఆలస్యం అయ్యింది కదా అని… జీతం కట్ చేస్తారని ఉద్దేశంతో ఆ ఉపాధ్యాయుడు స్కూలుకే రావడం మానివేస్తాడని, అప్పుడు విద్యార్థులు నష్టపోవలసి వస్తుందని హెచ్చరించారు. దానికంటే ఉదయం ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయున్ని సాయంత్రం అదనపు సమయం పని చేయమంటే బాగుంటుందని ధ్వజమెత్తారు.
ఉపాధ్యాయులకు పెట్టిన నిబంధనలే ఐఏఎస్ అధికారులకు కూడా విధించాలిని హితవు చెప్పారు. ముఖ్యమంత్రి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగే . ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం. అందుకే ఆయన కూడా జిల్లాల పర్యటనలు లేనప్పుడు తన కార్యాలయానికి సకాలంలో హాజరు కావాలని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు సచివాలయానికి హాజరవుతున్న దాఖలాలే లేవని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.