హైదరాబాద్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఆదివారం ప్రారంభమైంది. ఏటా దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు, వస్తువులను ప్రదర్శనలో ఉంచటంతో పాటు విక్రయించడానికి వేదికగా చేసుకునే నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1వ తేది ఆదివారం ప్రారంభమైంది. 82వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఈసారి 2400స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు
హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగే ఎగ్జిబిషన్ (నుమాయిష్)ను మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. 1938లో వంద స్టాళ్లతో ప్రారంభమైన నుమాయిష్.. ప్రస్తుతం 1500కుపైగా స్టాల్స్‌కు చేరుకుంది.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నుమాయిస్ భారీగా ప్రజాదరణ పొందిందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతిని పొందవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా 19 విద్యా సంస్థలు నడుస్తున్నాయని, సొసైటీ ద్వారా 10వేల మందికి లబ్ధి కలుగుతుందని తెలిపారు.
అన్ని రకాల సాంస్కృతిక సంప్రదాయాలు ఇక్కడ దర్శనమిస్తాయని వివరించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎంతో మంది వ్యాపారులు ఇక్కడకు వస్తారని, 30 వేల మంది విద్యార్థులకు ఈ సొసైటీ ద్వారా విద్యనందిస్తున్నారని చెప్పారు. మహిళల చదువుకు సొసైటీ పెద్దపీట వస్తుందని అంటూ సొసైటీలో చదివిన వారంతా ఎంతో మంది ఉన్నతస్థానాల్లో ఉన్నారని తెలిపారు.
పదివేల మంది సొసైటీ ద్వారా ఉపాధి పొందుతున్నారని, ప్రస్తుతం 45 రోజుల పాటు ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌కు సహకరించిన సహచర మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని హెల్త్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా బస్సులు నడుపుతుందని మంత్రి హరీశ్ చెప్పారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 82 సంవత్సరాల నుంచి నుమాయిష్ నడుస్తుందన్నారు. నుమాయిష్‌తో వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, విద్యా సంస్థలు నడుపడం గొప్ప విషయమన్నారు.