మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన ఆమరణ దీక్ష ను విరమించారు. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య (85 ) సోమవారం ఉదయం నుండి అమరణ దీక్ష తలపెట్టారు. కాపులకు 5% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించాలని..లేని పక్షంలో అమరణ దీక్ష చేస్తానని హరిరామ జోగయ్య హెచ్చరించారు.
డిసెంబర్ 31వ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని జోగయ్య అల్టిమేట్ జారీ చేసారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో హరి రామ జోగయ్య ఆదివారం రాత్రి నుంచి పాలకొల్లులో దీక్ష మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఆయన దీక్ష ను భగ్నం చేసి.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ జోగయ్య ఎక్కడ తగ్గకుండా ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేపట్టారు.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్లో మాట్లాడారు. దీక్ష విరమించాలని కోరారు. పవన్ కోరిక మేరకు హరిరామ జోగయ్య తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి.. ఆయన ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే తన కోరిక అని తెలిపారు.
అంతకు ముందు పవన్ జోగయ్య తో మాట్లాడుతూ..ఇది మూర్ఖపు, మొండి ప్రభుత్వమని.. కాపులకు రిజర్వేషన్లను వేరే విధంగా సాధించుకుందామని జోగయ్యకు తెలిపారు. రాష్ట్రానికి జోగయ్య లాంటి వ్యక్తుల సలహాలు, అనుభవం అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. వయసు రీత్యా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని జోగయ్యను పవన్ కోరారు. అన్ని రకాలుగా ఆలోచించి కార్యాచరణ రూపొందిద్దామని జోగయ్యకు పవన్ నచ్చజెప్పారు.