హిందువుల ఆరాధ్య దైవం అయ్యప్పస్వామిపై బైరి నరేశ్ ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఒప్పుకున్నాడని కొడంగల్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. రెండు రోజుల క్రితం బైరి నరేశ్ తోపాటు హనుమంతును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను పొందుపర్చారు. ఈ కేసులో ఏ2గా ఉన్న హనుమంతు కొడంగల్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడని తెలిపారు. ఇందు కోసం బైరి నరేశ్‌ను ఆహ్వానించగా.. అతను హాజరయ్యాడని పోలీసులు చెప్పారు.
ఆ క్రమంలోనే అయ్యప్పస్వామిపై.. బైరి నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉమాపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని వెల్లడించారు.
నరేశ్‌పై గతంలో వికారాబాద్ జిల్లా నవాబుపేటలో ఒక కేసు, హనుమకొండ జమ్మికుంటలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడు నరేశ్ ను కస్టడీకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం నరేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పరిగి సబ్ జైలుకు తరలించారు. కాగా, అయ్యప్పస్వామిపై బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్పస్వాములు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. హిందువుల మనోభావాలను కించపరిచాడంటూ నరేశ్‌ను కొందరు అయ్యప్ప స్వాములు చితకబాదారు. ఇప్పటి వరకు 200 పోలీస్ స్టేషన్లలో నరేష్ పై కేసులు నమోదైనట్లు సమాచారం.