తెలంగాణాలో అధికారంలోకి రావడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి ప్రజలకు చేరువ అయ్యేందుకు నిత్యం పలు రకాల కార్యక్రమాలు చేబడుతున్నది. తాజాగా, మహిళలను ఆకట్టుకునేందుకు సంక్రాంతికి ముగ్గులతో వారికి చేరువ కావాలని బిజెపి భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు ప్రతి చోట పెద్ద ఎత్తున కమలం పువ్వుతో సంక్రాంతి ముగ్గులు వేయించాలని బిజెపి అధినాయకత్వం సూచించింది.
సంక్రాంతి పండుగ అంటేనే మహిళలు ఎక్కువగా ఇష్టపడే పండుగ. ముఖ్యంగా ఇంటి ముందు ముగ్గులు వేయడాన్ని మహిళలు ఇష్టపడతారు. రకరకాల డిజైన్లతో ముగ్గులు వేసి, వాటిలో రంగులు నింపి ప్రతి ఇంటి ముందు కలర్ ఫుల్ గా ముగ్గులు దర్శనమిస్తాయి. ఇక ఈ క్రమంలోనే బిజెపి గుర్తు అయిన కమలం పువ్వు ను ఇళ్ళ ముందు వేసి ముగ్గులు తీర్చిదిద్ది బిజెపి బలాన్ని ప్రత్యర్థులకు చూపించాలని అధిష్టానం సూచించింది.
దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ ఇళ్ల తోపాటు, గ్రామాలు, పట్టణాలు, సిటీలలో బిజెపి అభిమానులతో ఇంటి ముందు కమలం పువ్వు గుర్తు తో ముగ్గులు వేయించాలని నిర్ణయించారు. ఇంతకు ముందు గుజరాత్ లో బిజెపి ఇటువంటి కార్యక్రమం చేపట్టింది.
ఇప్పటికే బీజేపీ ప్రజలకు చేరువ కావడానికి అనేక కార్యక్రమాలు చేబడుతున్నది. రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పాదయాత్రను కొనసాగించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ప్రజల మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక ప్రజా గోస బిజెపి భరోసా పేరుతో బైక్ ర్యాలీలు చేస్తూ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు.స్థానిక సమస్యలపై ఎక్కడికక్కడ బిజెపి శ్రేణులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.