2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావించే విధంగా 2023లో కొన్ని కీలక రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో చేర్పులు, మార్పులు చేపట్టాలని కసరత్తు చేస్తున్నట్లు బిజెపి వర్గాలు భావిస్తున్నాయి.
ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడం, తమది పనిచేసే ప్రభుత్వమని చాటడం, పార్టీలో, ప్రభుత్వంలో అసమ్మతిని చల్లార్చడం, పార్టీలో ఎవరూ తమను మించిన వారు లేరన్న అహంభావాన్ని ప్రదర్శించకుండా అడ్డుకట్ట వేయడం వంటివి మంత్రివర్గ మార్పులకు ప్రధాన కారణాలని పార్టీ వర్గాలు తెలిపాయి.
గత కొద్ది రోజులుగా ఢిల్లీలో పార్టీ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో వరుసగా జరుగుతున్న సమావేశాలు మంత్రివర్గంలో మార్పుల వార్తలకు ఊతమిస్తున్నాయి. ఈ నెల 16, 17 తేదీలలో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత, ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు మంత్రివర్గంలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రభుత్వంలోనే కాక పార్టీ సంస్థాగతంగా కూడా మార్పులు ఉంటాయని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు పార్టీ సంస్థాగత బాధ్యతలు చేపట్టవచ్చని, కొత్త ముఖాలు ప్రభుత్వంలో చేరవచ్చని మంత్రి పదవిని ఆశిస్తున్న పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.
బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పదవీ కాలం ఈ నెలాఖరులో ముగియనున్నది. అయితే లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేవరకు అదే పదవిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. కొన్ని రాష్ట్రాలలో బిజెపి సంఘటనా కార్యదర్శులను కూడా మార్పు చేయనున్నట్లు చెబుతున్నారు.
కర్నాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ రాష్ట్రాలకు చెందిన కొందరు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒక విధంగా 2024 ఎన్నికల బృందం ఏర్పాటు కోసం ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఈ కసరత్తు ఉంటుందని భావిస్తున్నారు. పలు రాష్ట్రాలలో పదవీకాలం ముగుస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుల భవిష్యత్తు కూడా నిర్ణయించాల్సి ఉంటుంది.