ఆందోళనకు దిగిన మరో ఇద్దరు వ్యక్తులను ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. ఈ విషయాన్ని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మిజాన్ వెల్లడించింది. మృతులు మహమ్ద్ మహదీ కరామి, సయ్యద్ మొహమ్మద్ హోస్సేనీలను శనివారం ఉదయం ఉరితీసినట్లు మీజాన్ తెలిపింది. ఈ ఇద్దరితో కలిసి ఇప్పటివరకు మొత్తం 14 మందికి ఉరిశిక్షను అమలు చేశారు.
వీరిద్దరూ పారామిలటరీ దళం సైనికుడిని హత్య గావించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిపై వచ్చిన ఆరోపణలను విచారించిన కోర్టు వీరిద్దరికీ డిసెంబర్ నెలలో మరణశిక్ష విధించింది. ఈ శిక్షలను సుప్రీంకోర్టు జనవరి 3 న సమర్ధించింది.
గత ఏడాది నవంబర్ 3న హిజాబ్ వ్యతిరేక నిరసన సమయంలో హత్యకు గురైన హదీత్ నజాఫీ నివాళిగా ఒక గ్రూప్ కరాజ్‌లో సమావేశమైంది. ఈ గుంపులోని వ్యక్తులు రుహుల్లా అజామియన్ అనే సైనికుడిని దుస్తులు విప్పించి హింసించి చంపారని ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కరామి, హోస్సేనీలను ప్రధాన నిందితులుగా చేర్చారు. చనిపోయిన రుహుల్లా బసిజ్ మిలీషియా సభ్యుడు. ఈ సంస్థ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆఫ్ ఇరాన్‌తో కలిసి పనిచేస్తున్నది.
ఇలా ఉండగా, నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ప్రకారం, 2022 లో ఇరాన్లో 500 మందికి పైగా ప్రజలను ఉరితీశారు. వీరిపై నమోదైన అభియోగాలపై న్యాయమైన విచారణ జరుపకుండానే రివల్యూషనరీ కోర్టు తలుపులు మూసి శిక్ష విధించిందని ఈ సంస్థ ఆరోపించింది. 2020 లో 267 మంది, 2021 లో 333 మందికి ఇరాన్లో మరణశిక్ష విధించారు.