నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనరెడ్డి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సభల్లో తొక్కిసలాటకు దారితీసిన కారణాలు, బాధ్యులను గుర్తించాలని సూచించింది. ఏర్పాట్లలో లోపాలు గుర్తించాలని కమిషన్ను కోరింది.
ఒకవేళ అనుమతుల ఉల్లంఘన జరిగితే దానికి కారణమైన వారిని గుర్తించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని, ఆయా ఘటనలపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది.
కందుకూరు, గుంటూరు ఉదంతాలు- రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధానికి దారి తీసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు ఈ రెండు పార్టీల నాయకులు. వైఎస్ఆర్సీపీ సహా రాజకీయ పార్టీలన్నీ నిర్వహించబోయే రోడ్లు, బహిరంగ సభలను నిషేధించింది. గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసుకునే వెసలుబాటు కల్పించింది.
కిందటి నెల 28వ తేదీన కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో సంభవించిన తొక్కిసలాటలో ఎనిమిది మంది, జనవరి 1వ తేదీన గుంటూరులోని వికాస్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మరో ముగ్గురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలను ఇదివరకే తీసుకుంది కూడా.
నడిరోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది. దీనికి సంబంధించిన జీవోను ఇటీవలే విడుదల చేసింది హోం మంత్రిత్వ శాఖ. పలు నిబంధనలను సూచించింది ఇందులో. బహిరంగ సభలను నిర్వహించడానికి అవసరమైన స్పష్టమైన మార్గదర్శకాలను జీవో నంబర్ 1లో పొందుపరిచింది. కందుకూరు, గుంటూరు తరహా విషాదకర, దిగ్భ్రాంతికర సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో దీన్ని అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.