ఇప్పటి వరకు ఓటిపి, డెబిట్, క్రెడిట్ కార్డుల ఎక్స్పైరీ, లోన్లు పేరుతో మోసం చేసిన సైబర్ క్రైం నేరస్థులు ఇప్పుడు ఉచిత వైఫై పేరుతో కొత్త రకం దోపిడికి ప్లాన్ వేస్తున్నారు. రద్దీ ఉండే ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని దోచుకుంటున్నారు. చాలామంది ఈ ప్రాంతాలకు వస్తుండడంతో వారికి ఉచిత వైఫైని ఎరగా వేసి దోచుకుంటున్నారు.
ఉచిత వైఫై పేరుతో అమాయకులకు సైబర్ నేరస్థులు గాలం వేస్తుండటం వెలుగులోకి వచ్చింది. ఇటీవలి కాలంలో ఓ యువకుడు నగరంలోని ఓ షాపింగ్ మాల్ వద్దకు వెళ్లాడు. తన మొబైల్లో డాటా తక్కువగా ఉండడంతో ఎవరిదైనా వైఫ్ ఉంటుందని భావించాడు. వైఫైని ఆన్ చేయగా ఓ షాపింగ్ మాల్ పేరుతో ఉచిత వైఫై పేరు రావడంతో మొబైల్కు కనెక్ట్ చేసుకున్నాడు.
బాధితుడు కనెక్ట్ కాగానే అతడి బ్యాంక్ ఖాతా నుంచి ముందుగా రూ.6,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇలా కొద్ది నిమిషాల్లో యువకుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.50,000 మాయం అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన యువకుడు షాపింగ్ మాల్లోకి వెళ్లి అక్కడి యజమానిని నిలదీశాడు. ఉచిత వైఫై పెట్టి డబ్బులు దోచుకున్నారని ఆరోపించాడు.
దీనికి స్పందించిన షాపింగ్ మాల్ నిర్వాహకుడు అసలు తమకు ఉచిత వైఫైలేదని, నీ డబ్బులు ఎవరు దోచుకున్నారో తెలుసుకో అని చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇలాగే చాలామంది అమాయకులు ఉచితంగా వైఫై వస్తోందని లాగిన్ కావడంతో నిండా మునుగుతున్నారు.
యువత ఇంటర్ నెట్ వాడకం విపరీతంగా పెరిగి పోయింది, దీనిని ఆసరా చేసుకున్న సైబర్ నేరస్థులు దానిని అస్త్రంగా చేసుకుని దోచుకుంటున్నారు. ఎవరూ ఉచితంగా ఏదీ ఇవ్వరని తెలుసుకోవాలి. ఉచితంగా వస్తోంది కదా అని తెలియని వైఫైలకు కనెక్ట్ అవుతే నిండా ముగుతారు.
అంతేకాకుండా వైఫైలకు కనెక్ట్ అయిన వారి మొత్తం వివరాలను సైబర్ నేరస్థులు తెలుసుకుని దోచుకుంటున్నారు. కనెక్ట్ అయిన బాధితుల డాటా హ్యాక్ చేసి తర్వాత బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. ఫోన్లోని పర్సనల్ ఫొటోలు, వీడియోలు, డాటాని తమకు అనుగుణంగా వాడుకునే అవకాశం ఉంది.
వాటిని అడ్డుపెట్టుకుని డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. తమకు తెలిసిన వారి వైఫై మాత్రమే ఉపయోగించాలని, అనుమానిత లింకులు, వైఫైని వాడుతే సైబర్ నేరస్థుల బారినపడే అవకాశం ఉందని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.