తెలంగాణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని ఆదేశించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసన సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్‌ను ఆశ్రయించడంతో 2016లో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేలా హైదరాబాద్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులతో అప్పటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే కొనసాగుతున్నారు.
సోమేశ్ కుమార్ విషయంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని కేంద్రం 2017లో హైకోర్ట్ కు వెళ్లింది. ఇవాళ క్యాట్ ఉత్తర్వులను కొట్టేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ నందాతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. సోమేష్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్రా అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగించవచ్చని సూచించింది.
ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. సీఎస్ సోమేష్ కుమార్ కంటే సమర్ధులైన అధికారులు తెలంగాణలో లేరని ప్రభుత్వం భావిస్తే ఏపీ ప్రభుత్వ అంగీకారంతో డిప్యూటేషన్‌పై రప్పించుకోవాలని అప్పట్లో కేంద్రం సూచించింది. రాష్ట్ర విభజన సందర్భంగా తనను ఏపీకీ కేటాయించడంపై సోమేష్ కుమార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ ట్రైబ్యునల్ ఆదేశాలను ఇప్పుడు హైకోర్టు కొట్టివేసింది.