తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ ఆఫీసర్ శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను ఎంపిక చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం, ఆమె బాధ్యతలు చేబట్టడం అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి 2025, ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతి కుమారి.. గతంలో సీఎం కార్యాలయంలో పని చేశారు. తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతి కుమారి రికార్డు సృష్టించారు.
ప్రస్తుతం ఆమె అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. సీఎంవోలో స్పెషల్ ఛేజింగ్ సెల్ బాధ్యతలను కూడా నిర్వహించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్‌గా కూడా శాంతి కుమారి సేవలందించారు.
ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను తక్షణమే విధుల నుంచి విడుదల (రిలీవ్) చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సోమేశ్‌కుమార్ ఈనెల 12లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల విభాగం (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.
సోమేశ్‌కుమార్ ఏపీ క్యాడర్‌కు చెందిన అధికారేనని తెలంగాణ హైకోర్టు మంగళవారం స్పష్టం చేయడంతో వెంటనే ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. మూడేండ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సోమేశ్‌కుమార్ ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నది.
ఆయన తెలంగాణ క్యాడర్లో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసుపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారణ జరిపి సోమేశ్‌కుమార్ ఏపీ క్యాడర్‌కే చెందుతారని తేల్చిచెప్పింది.