వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 90 సీట్లను గెలుపొందడం ద్వారా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్న బిజెపి ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం ప్రజానీకంకు బిజెపి సందేశం తీసుకు వెళ్లడం కోసం రాబోవు 60 రోజుల్లో 9వేల కార్నర్ సమావేశాలు జరపాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు నిర్ధేశించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు.. మోడీ విజయాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతి ఇంటికి కమలం గుర్తు వెళ్లాలన్నారు. రేపటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని జాయింట్ కన్వీనర్లు, ప్రభారీలు, విస్తారక్ల సమావేశంలో సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఇదే వ్యూహాన్ని అమలు చేశామని సునీల్ బన్సల్ తెలిపారు. అక్కడ రెండు సార్లు అధికారంలో వచ్చామని.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నేతలు అందరూ ప్రజల్లోనే ఉండాలని సూచించారు.
మిషన్ 90 లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ పర్యటనకు బుధవారం వచ్చిన సునీల్ బన్సల్ తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్, సహ కన్వీనర్, ప్రభారీ, విస్తారక్ లతో బన్సల్ కీలక భేటీ జరిపారు. మల్కాజ్ గిరి, మెదక్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలలో పాల్గొన్నారు. ఒక వైపు ప్రజలలోకి వెళ్లే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు బూత్ స్థాయి పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు.
రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్లను నియమించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం.. తాజాగా 17 లోక్సభ స్థానాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, ప్రభారీలను నియమించింది.