తమ గౌరవం తగ్గకుండా, లొంగుబాటు లేకుండా ఉండేట్లయితే పొత్తులకు ఓకే అంటామని, లేకుంటే ఒంటరిగానే బరిలోకి దిగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ గతంలో తనను తిట్టినప్పటికీ, ఒక పెద్ద రాక్షసుడ్ని ఎదిరించాలంటే మిగిలిన శత్రువులను కూడా కలుపుకొని వెళ్లాలని, అందుకని టిడిపితో సర్దుబాటు తప్పదని తెలిపారు.
గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు 6.9 శాతం ఓట్లు వచ్చాయని, అవన్నీ ఒక్కచొటే వచ్చి ఉంటే అసెంబ్లిdలో పోరాడడానికి కావాల్సిన సీట్లు వచ్చేవని ఆయన గుర్తు చేశారు. ఓట్లు చీలినందువల్ల వైసిపి 53 సీట్లలో టెక్నికల్‌గా గెలిచిందని, ఆ పరిస్థితి రాకుండా చూసేందుకే తాను ఓటు చీలినివ్వకూ డదనే వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. అయితే ఎన్ని సీట్లు అనే విషయం తాను ఇప్పుడే చెప్పనని పేర్కొన్నారు.
అయితే, ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒంటరిగా వెళ్తే పూర్తి మెజార్టీ వస్తుందని తనకు నమ్మకం కుదిరితే ఒంటరిగానే వెళ్తానని తెలిపారు. ముఖ్యమంత్రి అవుతానని తాను చెప్పలేనని, అది ప్రజలే చెప్పాలని, ప్రజలందరూ కోరుకుంటేనే జరుగుతుందని చెప్పానారు. తనకు ఏ అధికారం ఇవ్వకున్నా ఎప్పుడూ ప్రజలకు ఊడిగం చేస్తానని చెప్పారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ మూడు ముక్కల సిఎం అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. తనపై పదే పదే వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారని, తాను విడాకులు ఇచ్చిన తర్వాతనే పెళ్లిళ్లు చేసుకున్నానని, జగన్మోహన్ రెడ్డి స్కూళ్లో చదివే రోజుల నుండే ఎటువంటి వాడో తనకు తెలుసునని ఎద్దేవా చేశారు. వైసిపి నాయకులందరితో పోల్చుకుంటే వ్యక్తిగతంగా తానెంతో బెటరని, వారితో పోల్చుకుంటే తనను దేవుడిగా భావించి కాళ్లకు దండం పెట్టాలని చెప్పారు.
పదే పదే తనను ప్యాకేజీకి అమ్ముడు పోయావని అంటున్నారని పేర్కొంటూ రూ. 20 కోట్లకు పైగా పన్నులు కట్టే తనకు ప్యాకేజీలకు అమ్ముడు పోవాల్సిన అసవరం లేదని స్పష్టం చేశారు. నేను డబ్బులు తీసుకున్నానని మళ్లి అంటే మీరంతా కలిసి వైసిపి నేతలను చెప్పుతో కొట్టండంటూ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డితోనే తాను తలపడిన వాడిననని, అన్ని తెగించే ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ప్రాణాలు పోయినా వెనకాడేది లేదని హెచ్చరించారు. మూడు ముక్కల సిఎం జగన్ ఓ సైకో పాథ్ అని, యాంటీ సోషల్ అని, ఇర్రేషనల్, ఇల్లిగల్, క్రూయల్ అంటూ ధ్వజమెత్తారు. రాజు మంచి వాడు కాకుంటే సగం రాజ్యం పోతుందని, అదే సలహాలు ఇచ్చేవాడు సజ్జల అయితే మొత్తం రాజ్యం పోతుందని చురకులు అంటించారు.
