హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం రూర్కెలలోని బిర్సాముండా హాకీ స్టేడియంలో జరిగిన పోటీల్లో భారతజట్టు స్పెయిన్‌ను చిత్తుచేయగా.. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు వేల్స్‌ను ఓడించింది.
గ్రూప్-డిలో ఉన్న భారత్ తొలి క్వార్టర్‌లోనే ఒక గోల్ కొట్టి 1-0 ఆధిక్యతను సంపాదించింది. ఆ గోల్‌ను రోహిదాస్ చేశాడు. రెండో గోల్‌ను హార్దిక్ సింగ్ 26వ ని.లో చేశాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికే భారత్ 2-0గోల్స్ ఆధిక్యతలోకి దూసుకెళ్లింది.
రెండో అర్ధభాగంలో స్పెయిన్‌కు లభించిన పెనాల్టీ స్టోక్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతంగా నిలువరించాడు. మూడో క్వార్టర్లో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా ప్రయోజనం లేకపోయింది. 47వ నిమిషంలో అభిషేక్ స్పెయిన్ ఆటగాడ్ని ప్రమాదకరంగా నిరోధించడంతో ఫీల్డ్ అంపైర్ 10నిమిషాలు సస్పెండ్ చేసి మైదానం నుంచి బయటకు పంపాడు.
ఆ తర్వాత భారత్ 10మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ ఆడింది. 53, 57వ ని.లో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్లు లభించినా ప్రయోజనం లేకపోయింది. రెండో అర్ధభాగంలో స్పెయిన్ పుంజు కున్నా.. భారత డిఫెండర్లు అడ్డుగోడగా నిలవడంతో స్పెయిన్ జట్టు గోల్స్ చేయలేకపోయింది.
ఇదే గ్రూప్‌లో ఉన్న ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో 4-0తో వేల్స్‌ను చిత్తుచేసింది. దీంతో ఇంగ్లండ్, భారత్ 3పాయింట్లతో టాప్‌లో నిలిచాయి. 15న భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి నాలుగుజట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు దక్కించుకుంటాయి.